Nitish Rana: ఐపీఎల్: రాణా, త్రిపాఠి దూకుడు... సన్ రైజర్స్ టార్గెట్ 188 రన్స్
- ఐపీఎల్ లో నేడు సన్ రైజర్స్ వర్సెస్ కోల్ కతా
- మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు
- రాణా 56 బంతుల్లో 80 పరుగులు
- అర్ధసెంచరీతో రాణించిన త్రిపాఠి
చెన్నైలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఓపెనర్ నితీశ్ రాణా 56 బంతుల్లోనే 80 పరుగులు చేయడం విశేషం. రాణా స్కోరులో 9 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. వన్ డౌన్ బ్యాట్స్ మన్ రాహుల్ త్రిపాఠి కూడా దూకుడుగా ఆడడంతో కోల్ కతా స్కోరుబోర్డు పరుగులు తీసింది. త్రిపాఠి 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 53 పరుగులు చేశాడు. చివర్లో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ (9 బంతుల్లో 22) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
హైదరాబాద్ బౌలర్లలో మహ్మద్ నబీ 2, రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశారు. భువీ, నటరాజన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
కాగా, లక్ష్యఛేదనకు దిగిన సన్ రైజర్స్ రెండో ఓవర్లోనే కెప్టెన్ వార్నర్ వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన వార్నర్... ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో వెనుదిరిగాడు. అప్పటికి సన్ రైజర్స్ స్కోరు 1.3 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే. ఆ తర్వాత ఓవర్లోనే వృద్ధిమాన్ సాహా కూడా అవుటయ్యాడు. ఈ వికెట్ షకీబల్ హసన్ ఖాతాలో చేరింది.