Sundar Pichai: గూగుల్ మాతృసంస్థలో యువతులపై వేధింపులు... సుందర్ పిచాయ్ కి 500 మంది ఉద్యోగినుల లేఖ!

500 Employees Letter to Sunder Pichai Over Harrasment
  • ఆల్ఫాబెట్ లో పెరిగిపోయిన వేధింపులు
  • ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఉన్నతాధికారులు
  • ఉద్యోగుల సంరక్షణకు చర్యలు చేపడతామన్న సంస్థ
ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ లో తమపై వేధింపులు పెరిగిపోయాయని ఆరోపిస్తూ, దాదాపు 500 మందికి పైగా ఉద్యోగినులు సంతకాలు చేస్తూ, సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ కి లేఖను రాయడం తీవ్ర కలకలం రేపుతోంది. తమను ఆదుకోవాలని వారు ఈ లేఖలో వాపోయారు. తమను నిత్యమూ వేధిస్తున్న వారిని ఉన్నతాధికారులు రక్షిస్తున్నారని, వారిని నియంత్రించాలని కోరారు.

గూగుల్ మాజీ ఇంజనీర్ ఎమీ నీట్ ఫీల్డ్, తనపై ఎటువంటి వేధింపులు జరిగాయన్న విషయాన్ని తెలియజేస్తూ, 'న్యూయార్క్ టైమ్స్'కు వ్యాసం రాసిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఏకంగా 500 మంది ఈ లెటర్ రాయడం గమనార్హం. గూగుల్ లో పని చేసిన తరువాత తనకు మరో ఉద్యోగం చేయాలని అనిపించడం లేదంటూ ఎమీ తన అనుభవాలను ఈ వ్యాసంలో పూసగుచ్చినట్టు పేర్కొన్నారు. తనను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసిన అతనితో పాటే బలవంతంగా ముఖాముఖి భేటీలు చేయించారని, పక్కనే కూర్చోబెట్టారని వాపోయారు.

అతనితో కలసి పని చేయడం చాలా ఇబ్బందిగా ఉందని చెప్పినా ఉన్నతాధికారులు ఏ మాత్రమూ పట్టించుకోలేదని, తననే కౌన్సెలింగ్ తీసుకోవాలని, లేకుంటే సెలవుపై వెళ్లాలని సలహాలు ఇచ్చారని ఎమీ వెల్లడించారు. ఇటువంటి వేధింపులను ఎదుర్కొన్నది తాను ఒక్కదాన్నే కాదని, సంస్థలోని ఎంతో మంది విషయంలో అధికారులు ఇలానే ప్రవర్తించారని పేర్కొంది.

ఇక తాజాగా ఉద్యోగినులు రాసిన లేఖలో, ఎమీ తొలి బాధితురాలేమీ కాదని సుందర్ పిచాయ్ కి వివరించారు. వేధించిన వారినే సమర్ధిస్తున్న వాతావరణం ఉందని, 20 వేల మందికి పైగా పని చేస్తున్న మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యారని, అయినా మారకపోవడం ఏంటని ప్రశ్నించారు. కాగా, ఉద్యోగినులు రాసిన లేఖ సంచలనం సృష్టించగా, సంస్థ స్పందించింది. వారి ఆందోళనలపై విచారణ తీరును మరింత పారదర్శకంగా చేయనున్నామని పేర్కొంది. వారి సంరక్షణకు కొత్త కార్యక్రమాలను చేపట్టనున్నామని వెల్లడించింది.
Sundar Pichai
Alphabet
Google
Harrasment
Women
Employees

More Telugu News