Israel: ఇరాన్ అణుశుద్ధి కర్మాగారంపై సైబర్ ఎటాక్.. కుప్పకూలిన సెంట్రిఫ్యూజ్ వ్యవస్థ.. ఇజ్రాయెల్ పై అనుమానాలు!

Iran Atomic Agency Says Nuclear Facility Hit By Act Of Terrorism

  • నతాంజ్ అణుకర్మాగారంలో కుప్పకూలిన విద్యుత్ సరఫరా
  • అణు ఉగ్రవాదంగా అభివర్ణించిన ఇరాన్ అణు విభాగాధిపతి
  • తమ పనే అయి ఉండొచ్చన్న ఇజ్రాయెల్ మీడియా

ఉప్పు, నిప్పులా మారిన ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఇప్పుడు మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ అణుకర్మాగారమైన నతాంజ్‌లో యురేనియాన్ని శుద్ధి చేసే అత్యంత అధునాతన సెంట్రిఫ్యూజ్ వ్యవస్థను ప్రారంభించిన కాసేపటికే విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది.  

ఫలితంగా నేలపై ఉన్న వర్క్ షాపులతోపాటు నేలమాళిగలో ఉన్న అణుశుద్ధి యూనిట్లు సహా కర్మాగారం మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఇరాన్ అణువిభాగం అధికార ప్రతినిధి బెహ్రౌజ్ కమల్‌వాండి తెలిపారు. అయితే, ఈ ఘటన కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదన్నారు. దీని వెనక ఇజ్రాయెల్ హస్తం ఉందని, ఆ దేశ సైబర్ దాడే ఇందుకు కారణమని ఇరాన్ అధికారిక మీడియా ఆరోపించింది.

ఇది ఇజ్రాయెల్ కుట్రేనని ఇరాన్ మీడియా ఆరోపిస్తుండగా, ఆ దేశ అణు ఇంధన సంస్థ అధిపతి అలీ అక్బర్ సలేహీ దీనిని అణు ఉగ్రవాదంగా అభివర్ణించారు. దీనికి వ్యతిరేకంగా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) చర్యలు చేపట్టాలని కోరారు. ఇరాన్ అణుకర్మాగారంపై దాడిలో తమ ప్రమేయం ఉండొచ్చని ఇజ్రాయెల్ అధికారిక మీడియా కూడా అభిప్రాయపడడం గమనార్హం. పదేళ్ల క్రితం నతాంజ్‌పై జరిగిన ‘స్టక్స్‌నెట్’సైబర్ దాడిని ఈ సందర్భంగా ఉటంకించింది. కాగా, ఇరాన్ అణుకర్మాగారంపై దాడి ఇజ్రాయెల్ పనేనని తేలితే రెండు దేశాల మధ్య మరోమారు ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News