Uttar Pradesh: విమర్శలతో వెనక్కి తగ్గిన బీజేపీ.. కుల్దీప్ సింగ్ సెంగార్ భార్యకు టికెట్ రద్దు
- బాలికపై అత్యాచారం కేసులో కుల్దీప్ సెంగార్‌కు జైలు శిక్ష
- ఆయన భార్య సంగీతకు జిల్లా పంచాయతీ ఎన్నికల టికెట్
- విమర్శలు వెల్లువెత్తడంతో అభ్యర్థిత్వం రద్దు
బీజేపీ మాజీ ఎమ్మెల్యే, ఉన్నావ్ అత్యాచార కేసు దోషి కుల్దీప్ సింగ్ సెంగార్ భార్య సంగీతకు ఇచ్చిన టికెట్ విషయంలో బీజేపీ వెనక్కి తగ్గింది. ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసి పోటీ నుంచి తప్పించింది. ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జిల్లా పంచాయత్ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ భార్య సంగీతా సెంగార్‌ను ఫతేపూర్ చౌరాసీలోని వార్డు నంబరు 22 నుంచి బీజేపీ బరిలోకి దించింది. అయితే, 17 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి భార్యకు టికెట్ ఇవ్వడంపై సొంతపార్టీలోనే విమర్శలు వ్యక్తమయ్యాయి.
మరోవైపు, బీజేపీ అసలు రూపం ఇదేనంటూ ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తి పోశాయి. దీంతో వెనక్కి తగ్గిన బీజేపీ అధిష్ఠానం ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్ తెలిపారు. ఆమె స్థానంలో మరొకరికి టికెట్ ఇస్తామని పేర్కొన్నారు. కాగా, సంగీతా సెంగార్ గతంలో జిల్లా పంచాయతీ చైర్‌పర్సన్‌గా పనిచేశారు.