Deepika Padukone: ఎంఏఎంఐ ఛైర్ పర్సన్ పదవి నుంచి తప్పుకున్న దీపికా పదుకుణే!
- 2019లో ఎంఏఎంఐ ఛైర్ పర్సన్ బాధ్యతలను స్వీకరించిన దీపిక
- బిజీ షెడ్యూల్ కారణంగా వైదొలగుతున్నానని వెల్లడి
- ఈ సంస్థతో తన అనుబంధం కొనసాగుతుందని వ్యాఖ్య
ముంబై అకాడెమీ ఆఫ్ ది మూవింగ్ ఇమేజ్ (ఎంఏఎంఐ) సంస్థ ఛైర్ పర్సన్ పదవి నుంచి ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకుణే తప్పుకున్నారు. 35 ఏళ్ల దీపిక ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఈ పదవిలో కొనసాగడం తనకు అద్భుతమైన అనుభూతిని కలిగించిందని ఆమె ఈ సందర్బంగా తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ టాలెంట్ ను ముంబైకి రప్పించడానికి ఈ పదవి ద్వారా తాను కృషి చేశానని... ఒక నటిగా ఇందుకు ఎంతో గర్విస్తున్నానని చెప్పారు. అయితే, ప్రస్తుతం తనకున్న ఇతర పనుల కారణంగా... ఎంఏఎంఐకి తాను సమయాన్ని కేటాయించలేకపోతున్నానని దీపిక తెలిపారు. ఈ సంస్థతో తనకున్న అనుబంధం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని... మరో సమర్థవంతమైన వ్యక్తి ఈ సంస్థను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
2019లో ఎంఏఎంఐ ఛైర్ పర్సన్ బాధ్యతలను దీపిక చేపట్టారు. ఆ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ బాధ్యతలను స్వీకరించడం తనకు ఎంతో గర్వంగా ఉందని, తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని చెప్పారు. ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ ను ఈ సంస్థే నిర్వహిస్తుంటుంది. అయితే కరోనా కారణంగా గత ఏడాది జరగాల్సిన వేడుకలు రద్దయ్యాయి.