Ayyanna Patrudu: సవాల్ కు స్పందించాలంటే దమ్ముండాలి... స్థాయితో పనేంటి?: అయ్యన్నపాత్రుడు
- వివేకా హత్యకేసులో జగన్ కు లోకేశ్ సవాల్
- సవాల్ విసిరే స్థాయి లోకేశ్ కు లేదన్న వైసీపీ నేతలు
- ఊరకుక్కలు విశ్వాసంతో మొరుగుతున్నాయన్న అయ్యన్న
- జగన్ నేరచరిత్రను అందుకునే స్థాయి లోకేశ్ కు లేదని వ్యాఖ్యలు
ఇటీవల వివేకా హత్య కేసుకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్ కు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దాంతో ముందు గెలిచి ఆ తర్వాత సవాళ్లు విసరాలని వైసీపీ నాయకులు లోకేశ్ కు కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో లోకేశ్ కు మద్దతుగా టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్పందించారు. వైఎస్ జగన్ కు సవాల్ విసిరే స్థాయి నారా లోకేశ్ కు లేదని తాడేపల్లి గేటు వద్ద పెడిగ్రీ (కుక్కల ఆహారం) తిన్న విశ్వాసంతో కొన్ని ఊరకుక్కలు మొరుగుతున్నాయని విమర్శించారు.
"నిజమే... జగన్ రెడ్డిలా 43 వేల కోట్లు దోపిడీ చేసే స్థాయి లోకేశ్ ది కాదు. 31 కేసులున్న నేర చరిత్ర లోకేశ్ కి లేదు. బాబాయి హత్య కేసు దర్యాప్తును అడ్డుకునేంత స్థాయి లోకేశ్ కి ఎప్పటికీ రాదు" అని వ్యంగ్యం ప్రదర్శించారు. అయినా సవాల్ కు స్పందించాలంటే దమ్ముండాలి కానీ స్థాయితో పనేంటి? అని అయ్యన్న ప్రశ్నించారు. "వివేకా హత్యతో సంబంధం లేకపోతే 14న వెంకన్న సాక్షిగా ప్రమాణం చేయాలని మీ యజమానికి చెప్పొచ్చు కదా?" అని పేర్కొన్నారు.