Mamata Banerjee: మమతా బెనర్జీకి ఈసీ షాక్.. దీదీ ప్రచారంపై 24 గంటల నిషేధం!
- ఈరోజు రాత్రి 8 గంటల నుంచి అమల్లోకి
- శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యాఖ్యలు చేశారన్న ఈసీ
- గతంలో రెండు సార్లు నోటీసులు అందుకున్న దీదీ
- మైనారిటీ ఓటర్లపై వ్యాఖ్యలకు తొలి నోటీసు
- కేంద్ర బలగాలను ఘెరావ్ చేయాలన్నందుకు రెండోసారి
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఇప్పటి వరకు రెండుసార్లు నోటీసులు జారీ చేసిన ఎన్నికల సంఘం(ఈసీ) ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించింది. ఆమె ప్రచారంపై 24 గంటల నిషేధం విధించింది. ఈరోజు రాత్రి 8 గంటల నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుందని తెలిపింది.
మమతా బెనర్జీ వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఎన్నికల సంఘం తన ఆదేశాల్లో పేర్కొంది. తద్వారా ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని తెలిపింది. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో ఈ తరహా వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని దీదీకి ఈసీ సూచించింది.
మైనారిటీల ఓటర్లను ప్రభావితం చేసేందుకు మమత ప్రయత్నించారన్న బీజేపీ ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం తొలిసారి ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఇక ఎన్నికల విధుల్లో ఉన్న కేంద్ర బలగాలు బీజేపీకి సహకరిస్తున్నాయని.. వారిని ఘెరావ్ చేయాలని పిలుపునిచ్చినందుకుగానూ దీదీ రెండోసారి నోటీసులు అందుకున్నారు.