Mamata Banerjee: ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా రేపు మమతా బెనర్జీ ధర్నా
- దీదీ ఎన్నికల ప్రచారంపై ఈసీ 24 గంటల నిషేధం
- అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించిన మమత
- కోల్కతాలో రేపు మధ్యాహ్నం ధర్నా
- ఇప్పటి వరకు 2సార్లు నోటీసులు అందుకున్న దీదీ
తన ప్రచారంపై 24 గంటల నిషేధం విధిస్తూ ఎన్నికల సంఘం(ఈసీ) తీసుకున్న నిర్ణయంపై బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈసీ నిర్ణయాన్ని రాజ్యాంగవిరుద్ధమైన, అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు. ఈసీ చర్యలకు వ్యతిరేకంగా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ధర్నాకు దిగుతానన్నారు. ‘‘కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న అప్రజాస్వామిక, రాజ్యాంగవిరుద్ధ నిర్ణయానికి నిరసనగా రేపు మధ్యాహ్నం 12గంటల నుంచి కోల్కతాలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు కూర్చుంటాను’’ అని మమత ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఇటీవల ప్రచారంలో భాగంగా కేంద్ర బలగాలపై ఆరోపణలు చేసిన మమతా బెనర్జీకి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్ర బలగాలు తృణమూల్ ఓటర్లను అడ్డుకుంటున్నారని.. వారిని ఘెరావ్ చేయాలని ప్రచారంలో మమత పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం కఠిన చర్యలకు దిగింది. ఆమె ప్రచారంపై 24 గంటల నిషేధం విధించింది. మరో సందర్భంలో మైనారిటీ ఓటర్లను ప్రభావితం చేసే వ్యాఖ్యలు చేసినందుకుగానూ దీదీ తొలిసారి ఈసీ నోటీసులు అందుకున్నారు.