tirupati: ‘ప్రిజనరీ’ బుద్ధితో జగన్‌ రాళ్లేయిస్తే... వాటిని గొప్ప నిర్మాణాలకు వాడుకోగల ‘విజనరీ’ చంద్రబాబు: నారా లోకేశ్‌

Nobody can scare chandrababunaidu by throwing stones says nara lokesh

  • తిరుపతిలో టీడీపీ బహిరంగ సభపై రాళ్ల దాడి
  • రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన చంద్రబాబు
  • ఘటనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ లోకేశ్‌
  • సీఎం జగన్‌మోహన్‌ రెడ్డే చేయించారని ఆరోపణ
  • పరోక్షంగా జగన్‌ ఓటమిని ఒప్పుకున్నారని వ్యాఖ్య

తిరుపతిలో టీడీపీ ఎన్నికల ప్రచారంలో రాళ్ల దాడిపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్ర‌బాబు స‌భ‌ల‌కు వ‌స్తున్న జ‌నాన్ని చూసి  ఓర్వ‌లేకే సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి తన రౌడీమూక‌ల‌తో రాళ్ల దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. తద్వారా జగన్‌ తన ఓట‌మిని తానే ఒప్పుకున్నారని వ్యాఖ్యానించారు.

జగన్‌ను ఫ్యాక్షనిస్ట్‌గా అభివర్ణించిన లోకేశ్‌.. ఇలాంటి రాళ్ల దాడితో చంద్రబాబును భయపట్టలేరని వ్యాఖ్యానించారు. ‘ప్రిజనరీ’(ఖైదీ) బుద్ధితో జగన్‌ రాళ్లేయిస్తే.. వాటిని జ‌నానికి ప‌నికొచ్చే ఒక‌ నిర్మాణం చేయించ‌గ‌ల విజ‌న‌రీ (దార్శనికతగలవారు) చంద్ర‌బాబు అని వ్యాఖ్యానించారు.

గతంలో తిరుపతి సమీపంలో చంద్రబాబుపై జరిగిన బాంబు దాడిని ఈ సందర్భంగా లోకేశ్‌ గుర్తుచేశారు.  తిరుప‌తి కొండ‌పైన స్మ‌గ్ల‌ర్లు, తీవ్ర‌వాదుల‌తో క‌లిసి 24 క్లైమోర్ మైన్లు పెట్టి పేల్చితే చంద్రబాబును సాక్షాత్తూ ఏడుకొండ‌ల‌వాడే కాపాడారని తెలిపారు. ఏ ఒక్క‌రూ బ‌తికే అవ‌కాశంలేని అలాంటి దాడి నుంచి తేరుకుని స‌హ‌చ‌రులు ఎలా ఉన్నారని వాక‌బు చేసిన‌ గుండె ధైర్యం చంద్ర‌బాబుదని చెప్పుకొచ్చారు.

తిరుపతిలో టీడీపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. కొందరు దుండగులు సభకు విచ్చేసిన వారిపై రాళ్లు విసరగా, ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఓ మహిళ కూడా ఉన్నారు. దుండగులు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచార వాహనంపైనా రాళ్లు విసిరేందుకు యత్నించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు వాహనం దిగి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News