Telangana: అకాల వర్షానికి ఆరుగురి బలి.. తెలంగాణలో నేడు, రేపు వర్షాలు
- తెలంగాణలోని 130 ప్రాంతాల్లో వానలు
- రైతుల ప్రాణాలు తీసిన పిడుగులు
- కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షంపాలు
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిన్న కురిసిన అకాల వర్షం ఆరుగురిని పొట్టనపెట్టుకుంది. యాదాద్రి జిల్లా లింగోజీగూడలో పిడుగు పడి రైతు దంపతులు బండారు కరుణాకర్‌రెడ్డి (55), వేణమ్మ (50) ప్రాణాలు కోల్పోయారు. వారు పెంచుకుంటున్న గేదె కూడా ఈ ఘటనలో మృత్యువాత పడింది. ఇదే జిల్లాలోని బొమ్మల రామారం మండలం మర్యాలలోని మన్నె రాములు (75) పొలంలో పనిచేస్తుండగా పిడుగు పడడంతో ప్రాణాలు కోల్పోయాడు.
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామానికి చెందిన రైతు సంబంగ రామయ్య (60), రాయపోల్ మండలం మంతూరుకు చెందిన యువ రైతు పట్నం నర్సింలు (26) కూడా పిడుగుపాటుకు గురై మృతి చెందారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేటలో ఓ ఇటుక బట్టీలో పనిచేస్తున్న మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన ఈశ్వర్ (42) పిడుగు పడి మరణించాడు.
మరోవైపు, అకాల వర్షాలు, పిడుగులు రైతులను తీవ్ర ఇక్కట్లకు గురిచేశాయి. కల్లాలు, మార్కెట్లలో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కాగా, నిన్న రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలోని 130 ప్రాంతాల్లో వానలు పడ్డాయి. జనగామ జిల్లాలోని లింగాల ఘనపురంలో అత్యధికంగా 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఒడిశాపై 1500 మీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనికితోడు తమిళనాడు నుంచి కొంకణ్ వరకు గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయని, నేడు, రేపు కూడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.