Bhadradri Kothagudem District: పోడు భూముల స్వాధీనానికి వెళ్లిన అటవీ అధికారులు.. చెట్టుకు కట్టేసి దాడిచేసిన గిరిజనులు

Tribals Attacked on Forest Officers in Bhadradri Kothagudem dist

  • భద్రాద్రి కొత్తగూడెంలో ఘటన
  • పోడు భూములు చదును చేసేందుకు వెళ్లిన సిబ్బందిపై దాడి
  • ఎఫ్‌బీవోలపై కర్రలతో దాడి
  • పోడు భూముల జోలికి వస్తే అంతు చూస్తామని హెచ్చరిక

పోడు భూముల స్వాధీనానికి వెళ్లిన అటవీ అధికారులను గిరిజనులు చెట్టుకు కట్టేసి దాడిచేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల పరిధిలోని చింతగుప్ప గ్రామంలో జరిగింది. గ్రామ పరిధిలో ఉన్న 27 హెక్టార్లలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు అటవీ అధికారులు గత కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఇవి పోడు భూములు కావడంతో స్థానిక గిరిజనుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఈ క్రమంలో నిన్న ఉదయం అటవీ సిబ్బంది డోజర్‌తో ఆ ప్రాంతానికి చేరుకుని భూమిని చదును చేయడం మొదలుపెట్టారు. విషయం తెలిసిన గిరిజనులు డోజర్‌ను అడ్డుకుని డ్రైవర్ రమేశ్‌ను చితకబాదారు. డ్రైవర్ ఈ విషయాన్ని డి. కొత్తూరు ఫారెస్ట్ బీట్ అధికారి (ఎఫ్‌బీవో) సోడి రాజేశ్‌కు ఫోన్‌లో తెలియజేశాడు. దీంతో ఆయనతోపాటు సుజ్ఞానపురం ఎఫ్‌బీవో విజయ, జిన్నెలగూడెం ఎఫ్‌బీవో హుస్సేన్‌లు ఘటనా స్థలానికి చేరుకుని గిరిజనులను అడ్డుకున్నారు.

ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన గిరిజనులు వారిపైనా కర్రలతో దాడిచేశారు. ఎఫ్‌బీవో సోడి రాజేశ్‌ను తాళ్లతో చెట్టుకు కట్టేసి దాడిచేశారు. పోడు భూముల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. విషయం తెలిసిన సర్పంచ్ కట్టం కృష్ణ గిరిజనులకు సర్దిచెప్పి అటవీ అధికారులను విడిపించి పంపించారు. బాధిత అటవీ సిబ్బంది ఫిర్యాదు మేరకు గిరిజనులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News