Karnataka: కర్ణాటకలో 17 తర్వాత లాక్‌డౌన్ ప్రకటన.. యడియూరప్ప యోచన!
- ఈ నెల 17న పలు నియోజకవర్గాలకు ఉప ఎన్నిక
- 20వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ
- పది రోజులపాటు లాక్‌డౌన్ యోచన
- అంతకంటే ముందు అఖిలపక్ష సమావేశం
కర్ణాటకలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతికి అడ్డుకట్ట వేసేందుకు లాక్‌డౌన్ ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి యడియూరప్ప యోచిస్తున్నారు. ఈ నెల 17న బెళగావి లోక్‌సభ, మస్కి, బసవకల్యాణ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అవి ముగిసిన అనంతరం లాక్‌డౌన్ నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందని సమాచారం.
అయితే, అంతకంటే ముందు ఈ నెల 18 లేదంటే 19 తేదీల్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపక్షనేత సిద్దరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తదితరుల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు.
కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నగరాల్లో ఈ నెల 20 వరకు రాత్రి కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ఆలోగా కనుక కేసులకు అడ్డుకట్ట పడకుంటే 20వ తేదీ నుంచి పది రోజులపాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదవుతుండడం, క్రియాశీల కేసులు 70 వేలకు పైగా ఉండడంతోనే అప్రమత్తమైన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అత్యవసరం అయితే కనుక లాక్‌డౌన్ విధించక తప్పకపోవచ్చని సీఎం అన్నారు. ప్రజలు కొవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించాలని కోరారు.