Chandrababu: చంద్రబాబు వ్యక్తిగత భద్రతాసిబ్బందిని ఆరా తీసిన పోలీసులు!
- నిన్న చంద్రబాబు నిర్వహించిన సభపై రాళ్ల దాడి
- దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు
- రాళ్లు వేసిన వారిని చూశారా? అని భద్రతా సిబ్బందిని ప్రశ్నించిన పోలీసులు
తిరుపతి ఉపఎన్నిక ప్రచారం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న నిర్వహించిన రోడ్ షో లో కలకలం రేగింది. తిరుపతి గాంధీ రోడ్డులో చంద్రబాబు ప్రచార సభను నిర్వహిస్తుండగా గుర్తు తెలియని దుండగులు రాళ్లు రువ్వారు.
ఈ ఘటనలో ఒక మహిళతో పాటు, ఓ యువకుడికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న తనకే రక్షణ లేకపోతే... సామాన్యుల పరిస్థితి ఏమిటని మండిపడ్డారు.
మరోవైపు, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. చంద్రబాబు బస చేస్తున్న బస్సు వద్దకు పోలీసు అధికారులు ఈ ఉదయం వచ్చారు. దాడి ఘటనపై భద్రతా సిబ్బందిని ఆరా తీశారు. వ్యక్తిగత భద్రతా సిబ్బందిని పలు ప్రశ్నలు అడిగారు. 'రాళ్లు వేసిన వారిని మీరు చూశారా? రాళ్లు ఎటువైపు నుంచి వచ్చాయి?' అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.
మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. ఇప్పటికే వారు గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు. దీనికి సంబంధించి గవర్నర్ కు నిన్న రాత్రే టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు.