India: కనిపిస్తున్న టీకా ఫలితాలు... వ్యాక్సినేషన్ సాగుతున్న చోట తగ్గుతున్న కేసులు!

Results of the Vaccination Shows Latest Data

  • వ్యాక్సినేషన్ లో ముందున్న ఇజ్రాయెల్, యూఏఈ, యూకే
  • ఆయా దేశాల్లో గణనీయంగా తగ్గిన కొత్త కేసులు
  • ఇజ్రాయెల్ లో ఇప్పటికే ప్రజలందరికీ వ్యాక్సిన్
  • ఇండియాలో కేవలం 6.89 శాతం మందికే
  • వెల్లడించిన 'అవర్ వర్డ్ ఇన్ డేటా' గణాంకాలు

దాదాపు ఏడాది క్రితం ఇదే సమయానికి కరోనా అప్పుడప్పుడే ప్రపంచమంతా వ్యాపించి, దానికి సరైన చికిత్స ఏంటన్నది కూడా తెలియని పరిస్థితి. కేవలం శరీరంలోని రోగ లక్షణాలను తగ్గించడం ద్వారా ఉపశమనం కలిగిస్తూ, వైద్యులు చికిత్సలు చేశారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. కరోనా వైరస్ శరీరంలోనే అంతం చేసే పలు రకాల టీకాలు వచ్చాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత, దాని ఫలితాలు ఇప్పుడిప్పుడే స్పష్టంగా మానవాళికి తెలుస్తోంది. తమ దేశ ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడంలో ముందున్న ఇజ్రాయెల్, యూకే వంటి దేశాల్లో ఇప్పుడు కొత్తగా వస్తున్న కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడమే ఇందుకు తార్కాణం.

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను నమోదు చేస్తున్న 'అవర్ వర్డ్ ఇన్ డేటా', ఈ నెల 12 వరకూ ఏఏ దేశాల్లో శరవేగంగా టీకా ఇచ్చే కార్యక్రమం సాగుతోందన్న వివరాలను వెల్లడించింది. ఆయా దేశాల్లో తగ్గిన కేసుల సంఖ్యనూ ప్రస్తావించింది. ఇజ్రాయెల్ అత్యధికంగా ప్రతి 100 మందికీ 118 డోస్ లను అందించింది. అంటే, అక్కడ రెండో డోస్ తీసుకుంటున్న వారి సంఖ్య ప్రతి 100 మందిలో 18 అన్నమాట. ఇంకా చెప్పాలంటే, దేశంలోని ప్రతిఒక్కరికీ కనీసం ఒక డోస్ టీకా అందగా, రెండో డోస్ 18 మందికి అందింది.

ఇక ఇజ్రాయెల్ తరువాతి స్థానంలో ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రతి 100 మందికీ 91 డోస్ లను అందించింది. ఈ లెక్కన జనాభాలో అత్యధికులకు కనీసం ఒక డోస్ అందినట్టే. ఆపై స్థానాల్లో చీలీ 63 డోస్ లతో, యూకే 59 డోస్ లతో, బహ్రెయిన్, యూఎస్ లు 55 డోస్ లతో, సెర్బియా 42 డోస్ లతో నిలిచాయి. ఆపై శరవేగంగా వ్యాక్సినేషన్ సాగుతున్న టాప్ టెన్ దేశాల్లో హంగేరీ, ఖతార్, ఉరుగ్వేలు కూడా ఉన్నాయి.

ఇక ఈ దేశాల్లో  కొత్త కరోనా కేసులను పరిశీలిస్తే, జనవరి 20వ తేదీన రోజుకు 10 వేల కేసులకు పైగా నమోదవుతుండగా, ఏప్రిల్ రెండో వారానికి ఈ సంఖ్య 200 లోపునకు పడిపోయింది. దేశ జనాభా 90 లక్షలు కాగా, ఇప్పటికే 8.30 లక్షల మందికి కరోనా వచ్చి పోవడంతో, వారిలో యాంటీ బాడీలు పెరిగాయి. హెర్డ్ ఇమ్యూనిటీ కూడా 70 శాతానికి చేరింది. మరో 53 లక్షల మందికి రెండు డోస్ ల టీకాలను ఇచ్చారు.

గత సంవత్సరం జూన్ లోనే ముందుచూపుతో మోడెర్నా నుంచి వ్యాక్సిన్ ను కొనుగోలు చేయడం ఇజ్రాయెల్ కు లాభించింది. ఆపై ఆస్ట్రాజెనికా, ఫైజర్ లతో సైతం ఆ దేశ ప్రభుత్వం డీల్స్ కుదుర్చుకుంది. 50 లక్షల డోస్ లను దాచుకునేలా భారీ ఫ్రిజ్ లను భూగర్భంలో ఏర్పాటు చేసి ముందే జాగ్రత్త పడింది. యూకే విషయానికి వస్తే, జనవరిలో రోజుకు 68 వేల కేసులు వచ్చే స్థితి నుంచి ఏప్రిల్ 13న 2,472 కేసులు వచ్చే స్థాయికి మహమ్మారి నియంత్రణలోకి వచ్చింది. ఆపై ఆంక్షల తొలగింపు మొదలై, ప్రజలు సగటు జీవన స్రవంతిలోకి వచ్చేశారు.

అమెరికాలోనూ కేసులు తగ్గుతున్నాయి. జనవరి 8న 3 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, ఇప్పుడా సంఖ్య 77 వేలకు పడిపోయింది. ఈ సంఖ్య ఎక్కువగానే కనిపిస్తున్నా, ఇప్పటికే 36 శాతం మందికి టీకాలు ఇచ్చిన యూఎస్, సమీప భవిష్యత్తులో ప్రతి ఒక్కరికీ టీకాను అందిస్తామని అంటోంది.

ఇదిలావుండగా, ఈ నెల 12 వరకూ ఇండియాలో 'అవర్ వరల్డ్ ఇన్ డేటా' గణాంకాల మేరకు కేవలం 6.89 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ అందింది. ఈ కారణం చేతనే ఇండియాలో రోజువారీ కేసుల సంఖ్య 2 లక్షలకు చేరువ అవుతోంది. హెర్డ్ ఇమ్యూనిటీ రావాలంటే, ఇండియా చాలా దూరం ప్రయాణం చేయాల్సి వుందనడంలో సందేహం లేదు.

దాదాపు 130 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే, 260 కోట్లకు పైగా డోస్ లు అవసరం. అంత వ్యాక్సిన్ లభించాలంటే, కనీసం రెండు సంవత్సరాలకు పైగా సమయం పడుతుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. అప్పటివరకూ కరోనా సోకకుండా చూసుకునేందుకు మాస్క్ లను ధరిస్తూ, భౌతిక దూరం పాటించడమే మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News