Nirmala Sitharaman: మరో మారు దేశవ్యాప్త లాక్ డౌన్ పై నిర్మల సీతారామన్ తాజా వ్యాఖ్యలు!

No Another Lockdown in India says Nirmala Sitharaman

  • ఇండియాలో విజృంభిస్తున్న కరోనా
  • ఇంకో లాక్ డౌన్ ఆలోచన లేదు
  • స్థానిక ప్రభుత్వాలే నియంత్రిస్తాయి
  • వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్ పాస్ తో నిర్మల

ఇండియాలోని పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభించి, కొత్త కేసులు పెరుగుతున్న వేళ, మరోసారి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధిస్తుందని జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పందించారు. ఇంకోసారి లాక్ డౌన్ ను విధించే ఆలోచనేదీ కేంద్రం వద్ద లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే, కేసులు అధికంగా ఉన్న చోట్ల స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులే నియంత్రణ చర్యలు చేపడతారని, కఠిన నిబంధనలను వారు అమలు చేసుకోవచ్చని అన్నారు.

గత సంవత్సరం లాక్ డౌన్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైందని వ్యాఖ్యానించిన ఆమె, మరోసారి అటువంటి పరిస్థితిని తీసుకుని రావడం తమకు ఇష్టం లేదని అన్నారు. కేసులు వచ్చిన ప్రాంతాల్లో మాత్రం నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని, ఈ విషయంలో రాష్ట్రాలు ఇచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్రోఢీకరిస్తున్నామని, ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగానే ఉన్నాయని నిర్మల వ్యాఖ్యానించారు.

వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్ పాస్ తో ఆన్ లైన్ మాధ్యమంగా జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆమె, లాక్ డౌన్ ప్రభావం ఇండస్ట్రీస్, ఎకానమీపై చూపిన ప్రభావంపై మాట్లాడారు. కరోనా రెండో దశ కొనసాగుతున్నా, లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఐదు స్తంభాల వ్యూహాన్ని తాము అమలు చేస్తున్నామని తెలిపారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సిన్, నిబంధనల అమలు వంటి అంశాలపై దృష్టిని సారించిమని పేర్కొన్న ఆమె, వైరస్ సోకిన వారిని హోమ్ క్వారంటైన్ చేస్తున్నామని, ఆరోగ్య సమస్య సీరియస్ అయితేనే ఆసుపత్రులకు తరలిస్తున్నామని అన్నారు.

ఇండియా రుణ సామర్థ్యాన్ని, ఆర్థిక లభ్యతను పెంచేందుకు ప్రపంచ బ్యాంకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా నిర్మల సీతారామన్ ప్రశంసించారు.

  • Loading...

More Telugu News