Jharkhand: అరగంట సేపు అర్థించినా డాక్టర్లు రాలేదు.. గేటు దగ్గరే చనిపోయిన కరోనా రోగి!
- ఝార్ఖండ్ రాజధాని రాంచీ సదర్ ఆసుపత్రిలో ఘటన
- ఆరోగ్య మంత్రిని కడిగిపారేసిన రోగి కూతురు
- కేవలం ఓట్ల కోసమే వస్తారా? అంటూ నిలదీత
- బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ
అరగంట సేపు డాక్టర్.. డాక్టర్ అని ఎంత పిలిచినా రాలేదు. ఆసుపత్రి గేటు దగ్గరే సాయం కోసం ఏడుస్తూ వేడుకున్నా ఏ ఒక్కరూ స్పందించలేదు. చివరికి ఆసుపత్రి గేటు దగ్గరే కరోనా పేషెంట్ ప్రాణాలు వదిలాడు. దీంతో అతడి కూతురు తన గుండెల్లో గూడు కట్టుకున్న బాధనంతా వెళ్లగక్కింది. అదే టైంలో ఆసుపత్రి పరిశీలనకు వచ్చిన ఆరోగ్య మంత్రిని కడిగిపారేసింది. ఈ ఘటన ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని సదర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం జరిగింది. ఆ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ అయింది.
హజారీబాగ్ కు చెందిన పవన్ గుప్తా అనే 60 ఏళ్ల వృద్ధుడికి కరోనా సోకి తీవ్ర అస్వస్థతకు గురవడంతో అతడి కూతురు సదర్ ఆసుపత్రికి తీసుకొచ్చింది. అయితే, డాక్టర్లు అక్కడ లేకపోవడం, ఆసుపత్రిలో ఏ మూల తిరిగినా, ఎవరిని అడిగినా ఎవరూ పట్టించుకోకపోవడంతో కాలయాపన జరిగి, ఆమె తండ్రి చనిపోయాడు. దీంతో ఆమె దిక్కులుపిక్కటిల్లేలా రోదించింది. ఆసుపత్రి వారిని నిలదీసింది. అరగంట నుంచి సాయం కోసం అర్థిస్తున్నా ఎవరూ రారా? అంటూ నిలదీసింది.
ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా వచ్చారని తెలిసి ఆయన్నూ కడిగిపారేసింది. ‘‘మంత్రిగారూ.. మీ వైద్యులంతా బిందాస్ గా గడుపుతున్నారు. మా నాన్న కొనూపిరితో కొట్టుమిట్టాడినా అరగంట దాకా ఏ డాక్టరూ రాలేదు. మీరు కేవలం ఓట్లు అడగడం కోసమే వస్తారా?’’ అంటూ ఆవేదనాభరితంగా నిలదీసింది. మీ ఓట్లను కాపాడుకోవడానికే ఇప్పుడు ఆసుపత్రిలో తనిఖీలు చేస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాగా, ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి బన్నా గుప్తా హామీ ఇచ్చారు. తన తండ్రి మరణంతో ఆ మహిళ ఏడవడం తనను కలచివేసిందని, ఘటనపై విచారణకు ఆదేశించానని ఆయన చెప్పారు.