Uttar Pradesh: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కి కరోనా.. మాజీ సీఎం అఖిలేశ్ కి కూడా సోకిన కొవిడ్!
- కార్యాలయ అధికారులకు పాజిటివ్ రావడంతో ఐసోలేషన్ లోకి
- తాజా టెస్టుల్లో పాజిటివ్ గా రిపోర్ట్
- ఇంటి నుంచే సమీక్షలు చేస్తానన్న యోగి
- ఇప్పటికే రెండు సమీక్షలు చేశానని వెల్లడి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు కరోనా సోకింది. నిన్ననే స్వీయ ఐసోలేషన్ లోకి వెళ్లిన ఆయన.. ఇవ్వాళ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కరోనా తాలూకు లక్షణాలు ఉండడంతో టెస్ట్ చేయించుకున్నానని, అందులో పాజిటివ్ గా తేలిందని ఆయన చెప్పారు. డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నానని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు.
తన కార్యాలయ అధికారులకు కరోనా పాజిటివ్ రావడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆయన మంగళవారం ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఆయన ఓఎస్డీ అభిషేక్ కౌషిక్ సహా కొందరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఐసోలేషన్ లోకి వెళ్లిన యోగి వెంటనే టెస్టులు చేయించుకున్నారు. తనకు కరోనా సోకినా ఇంటి నుంచి అన్ని పనులు చేస్తానని, వర్చువల్ గా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సమీక్ష సమావేశాలు నిర్వహిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే కరోనా వచ్చినా రెండు సమీక్షలు నిర్వహించానన్నారు.
ఇదిలావుంచితే, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కూడా కరోనా బారిన పడ్డారు. హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళాకు వెళ్లొచ్చిన తర్వాత ఆయనలో స్వల్ప లక్షణాలు కనిపించాయి. దీంతో పరీక్షలు చేయించుకోవడంతో ఆయనకు పాజిటివ్ గా తేలింది.