ICU at Home: ఇంటి వద్దకే ఐసీయూ.. ముంబైలో కొత్త సేవలు ప్రారంభం!
- ఐసీయూ ఎట్ హోమ్ సర్వీసులు ప్రారంభం
- నర్సులు, ఆక్సిజన్, ఫిజియో థెరపిస్ట్ అన్నీ ఇంటి వద్దకే
- సేవలను బట్టి రూ. 1,500 నుంచి రూ. 15,000 వరకు ఛార్జి
కరోనా కేసులు ఊహించని విధంగా పెరిగిపోతుండటంతో... ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లకు బెడ్లు కూడా దొరకని పరిస్థితి అనేక చోట్ల నెలకొంది. ముఖ్యంగా ముంబైలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
ఈ క్రమంలో కరోనా సోకినవారి కోసం ముంబైలో సరికొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. 'ఐసీయూ ఎట్ హోమ్ సర్వీస్' పేరుతో సేవలు ప్రారంభమయ్యాయి. దీని ద్వారా నర్సులు, మెడిసిన్, ఆన్ లైన్ కన్సల్టేషన్, ఆక్సిజన్, ఫిజియోథెరపిస్ట్ వంటి సేవలు ఇంటి వద్దకే వస్తాయి. ఈ సేవలు కావాలనుకునే వారు సర్వీసులను బట్టి రోజుకు రూ. 1,500 నుంచి రూ. 15,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
మరోవైపు, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, మహారాష్ట్రలో మెడికల్ ఆక్సిజన్ కు కొరత ఏర్పడుతోంది. ఆక్సిజన్ కు డిమాండ్ పెరిగిపోవడంతో, సరఫరా చేయలేక చేతులెత్తేస్తున్నారు. ఈ క్రమంలో మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేయాలంటూ పక్క రాష్ట్రాలను కోరామని మహారాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేశ్ తోపే తెలిపారు. మెడికల్ ఆక్సిజన్ కొరత నేపథ్యంలో దాన్ని వృథా చేయడాన్ని వీలైనంతగా తగ్గించాలని కోరారు.
మెడికల్ ఆక్సిజన్ కొరత గురించి మహా సీఎం ఉద్ధవ్ థాకరే కూడా నిన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిర్ ఫోర్స్ విమానాల ద్వారా మెడికల్ ఆక్సిజన్ ను మహారాష్ట్రకు సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.