India: ద్వైపాక్షిక నియంత్రణలు చట్ట విరుద్ధం... అనుకున్నట్టుగానే ఇండియాకు మిసైల్స్ పంపుతాం: రష్యా
- ఎస్-400 మిసైల్స్ సరఫరా ఆగబోదు
- ఇండియాతో దీర్ఘకాల బంధమే ముఖ్యం
- అమెరికా ఆంక్షలు సరికాదన్న రష్యా
ముందుగా అనుకున్నట్టుగానే ఎస్-400 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ వ్యవస్థలను ఇండియాకు అందిస్తామని రష్యా స్పష్టం చేసింది. రష్యా నుంచి ఈ మిసైల్స్ ను ఇండియా కొనేందుకు అమెరికా అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తున్నవేళ, భారత్ లో రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి నికోలే కుడాషేవ్ స్పందించారు. ద్వైపాక్షిక నియంత్రణలు చట్ట విరుద్ధమని, ఇండియాతో దీర్ఘకాల బంధం దిశగానే రష్యా అడుగులు వేస్తుందని అన్నారు. ఎస్-400ల డెలివరీ అనుకున్న సమయానికే పూర్తవుతుందని స్పష్టం చేశారు.
కాగా, ఇటీవలి కాలంలో రష్యా, పాకిస్థాన్ మధ్య ఆయుధాల విక్రయ డీల్ కుదరడంపై భారత్ కాస్తంత ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, పాక్ తో తమ సంబంధం ఇరు దేశాల ప్రయోజనాలను కాపాడేలా మాత్రమే ఉంటుందని ఆయన అన్నారు. ఇస్లామాబాద్ తో తమ బంధం పరిమితంగానే ఉంటుందని, పరిస్థితులను బట్టి పాక్ తో సంబంధాలపై నిర్ణయాలుంటాయని అన్నారు. ఉపఖండంలో సుస్థిరత కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తామని తెలిపారు.
తనకు తెలిసినంత వరకూ ఇండియా - రష్యాల మధ్య కుదిరిన ఒప్పందాల మేరకు క్షిపణి వ్యవస్థ అందుతుందని కుడాషేవ్ వ్యాఖ్యానించారు. అమెరికా బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ఇక్కడ తావులేదని అన్నారు. ఇద్దరు విదేశాంగ మంత్రులు, వారి దేశీయ ప్రయోజనాల మేరకు కుదుర్చుకున్న ఒప్పందాన్ని గౌరవించాల్సిందేనని అన్నారు.
ఇదే సమయంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్జి లావ్ రోవ్, ఇటీవల ఇండియాలో పర్యటించి, ఆ వెంటనే పాకిస్థాన్ వెళ్లిన విషయమై స్పందిస్తూ, పాకిస్థాన్ ఉగ్రవాదంపై పోరాడేందుకే కొన్ని రకాల ప్రత్యేక సైనిక పరికరాలను అందించాలని నిర్ణయించిందని అన్నారు. ఇండియాతో పోలిస్తే, పాక్ కు తాము పరిమితంగానే సహకారాన్ని అందిస్తున్నామని, ఉగ్రవాదంపై పోరాటం ఇరుదేశాల కామన్ ఎజెండా అని అన్నారు.