Virat Kohli: నాలుగేళ్ల తరువాత దిగజారిన కోహ్లీ ర్యాంకు... వన్డేల్లో టాప్ బ్యాట్స్ మన్ గా బాబర్ ఆజమ్!
- 1,258 రోజుల పాటు టాప్ లో ఉన్న కోహ్లీ
- కోహ్లీ స్థానాన్ని ఆక్రమించిన పాకిస్థానీ క్రికెటర్
- మూడవ స్థానంలో రోహిత్ శర్మ
- తాజా ర్యాంకులు ప్రకటించిన ఐసీసీ
2017 తరువాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, రెండో ర్యాంకుకు దిగజారాడు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసిన ర్యాంకింగ్స్ ప్రకారం, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తొలి స్థానాన్ని ఆక్రమించగా, కోహ్లీ రెండో ప్లేస్ కు పరిమితం అయ్యాడు. ప్రస్తుతం బాబర్ ఆజమ్ ఖాతాలో 865 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రెండో స్థానంలో ఉన్న కోహ్లీకి 857 పాయింట్లు ఉన్నాయి.
ప్రస్తుతం 26 ఏళ్ల వయసులో ఉన్న బాబర్ ఆజమ్, 2015 నుంచి వన్డే క్రికెట్ ఆడుతున్నాడు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన పోటీలో 94 పరుగులు చేసిన తరువాత ఆజమ్, ఈ ఘనత సాధించాడు. దీంతో 1,258 రోజుల నుంచి టాప్ ర్యాంక్ లో పదిలంగా ఉన్న విరాట్ కోహ్లీ, కిందకు దిగాల్సి వచ్చింది.
ఇక టాప్ లో ఉన్న వన్డే ర్యాంకర్లను పరిశీలిస్తే, రోహిత్ శర్మ 3వ స్థానంలో (825 పాయింట్లు), రాస్ టేల్ నాలుగో స్థానంలో (801 పాయింట్లు), ఆరోన్ ఫించ్ ఐదో స్థానంలో (791 పాయింట్లు) ఉన్నారు. ఇంతవరకూ 80 వన్డేలు మాత్రమే ఆడిన బాబర్ ఆజమ్ 3,808 పరుగులు సాధించడం విశేషం. ఇందులో 13 సెంచరీలు, 17 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతని సగటు 56.38గా ఉంది.
ఇక టెస్టుల విషయానికి వస్తే, గతంలో కెరీర్ బెస్ట్ గా ఐదో ర్యాంకు వరకూ వచ్చిన బాబర్ ఆజమ్, ప్రస్తుతం ఆరో ర్యాంకులో కొనసాగుతున్నాడు. టీ-20ల విషయానికి వస్తే, ఇటీవలి కాలం వరకూ టాప్ పొజిషన్ లో ఉన్న ఆజమ్, ఇప్పుడు మూడవ ర్యాంకులో ఉన్నాడు.