Kurnool District: కైరుప్పలలో పిడకల సమరం.. రెండు వర్గాలుగా విడిపోయి పిడకలు విసురుకున్న ప్రజలు
- కర్నూలు జిల్లా కైరుప్పలలో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు
- పిడకల సమరంలో 22 మందికి గాయాలు
- కర్నూలు చౌడేశ్వరీ ఆలయం చుట్టూ గాడిదలతో ప్రదక్షిణ
కర్నూలు జిల్లా కైరుప్పలలోని వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉగాది మరుసటి రోజైన నిన్న ఏళ్లుగా వస్తున్న పిడకల సమరాన్ని (పెద్ద నుగ్గులాట) గ్రామస్థులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి పిడకలతో దాడిచేసుకున్నారు. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
కాగా, పిడకల సమరంలో 22 మంది స్వల్పంగా గాయపడ్డారు. మరోవైపు, ఉగాది ఉత్సవాల్లో బాగంగా నిన్న కర్నూలులోని కల్లూరు చౌడేశ్వరీ దేవి ఆలయం చుట్టూ గాడిదలు, ఎడ్ల బండ్లతో ప్రదక్షిణాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వందలాదిమంది భక్తులు తరలివచ్చారు.