gutha sukhendar reddy: సాగర్ ఎన్నికలో పోటీ చేయడం జానారెడ్డికి ఇష్టం లేదు: తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
- కాంగ్రెస్ అధిష్ఠానమే తనను బలవంతంగా నిలబెట్టిందని జానారెడ్డే చెప్పారు
- నేను శాసన మండలి ఛైర్మన్ హోదాలో ఉన్నాను
- అయినప్పటికీ నా పేరును వాడుతున్నారు కాబట్టి స్పందిస్తున్నాను
తెలంగాణలో నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాగర్ ఉప ఎన్నికలో పోటీ చేయడం జానారెడ్డికి ఇష్టం లేదని ఆయన చెప్పారు. తమ పార్టీ అధిష్ఠానమే తనను బలవంతంగా నిలబెట్టిందని జానారెడ్డే చెప్పారని గుత్తా సుఖేందర్ తెలిపారు.
తాను ప్రస్తుతం శాసన మండలి ఛైర్మన్ హోదాలో ఉన్నప్పటికీ, తన పేరును సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో ఉపయోగిస్తున్నారని అందుకే తాను దీనిపై స్పందిస్తున్నానని చెప్పారు. జానారెడ్డికి సీఎం అయ్యే అవకాశం ఎన్నడూ ఉండబోదని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కాంగ్రెస్ పార్టీకి అధికారం రాలేదన్న బాధే ఆ పార్టీ నేతల్లో ఉందని, తెలంగాణ అభివృద్ధిపై మాత్రం లేదని ఆయన అన్నారు.