Joe Biden: ఆఫ్ఘన్‌లో ప్రస్తుత పరిస్థితులను ఏ సైన్యమూ పరిష్కరించలేదు: బైడెన్
- సెప్టెంబర్ 11 నాటికి మా బలగాలు వెనక్కి
- ఆఫ్ఘన్‌లో శాంతిని నెలకొల్పేందుకు ఇతర దేశాలు కృషి చేయాలి
- దౌత్యపరమైన సహకారం కొనసాగుతుంది
ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 11 నాటికి తమ బలగాలను ఉపసంహరించుకుంటామని అమెరికా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అధ్యక్షుడు జో బైడెన్, వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ మరోసారి స్పందించారు. ఆఫ్ఘన్ సుస్థిర భవిష్యత్తులో భారత్ తో పాటు పాక్, రష్యా, చైనా, టర్కీ దేశాలకూ భాగస్వామ్యం ఉందని బైడెన్ అన్నారు.
ఆఫ్ఘన్‌లో శాంతిని నెలకొల్పేందుకు ఆ దేశాలు కృషి చేయాలని చెప్పారు. తమ బలగాలను వెనక్కి రప్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆఫ్ఘన్‌లో ప్రస్తుత పరిస్థితులను ఏ సైన్యమూ పరిష్కరించలేదని జెన్ సాకీ అన్నారు. ఆ దేశంలో దౌత్యపరమైన మార్గాల్లో మాత్రమే సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. అమెరికా సైన్యాన్ని వెనక్కి రప్పించినప్పటికీ తమ దౌత్యపరమైన సహకారం కొనసాగుతుందని తెలిపారు.