Peddireddi Ramachandra Reddy: చంద్రబాబు, లోకేశ్ కు టీడీపీలో అందరూ వ్యతిరేకంగా ఉన్నారు: పెద్దిరెడ్డి
- ఓట్ల కోసం తండ్రీకొడుకులు నాటకాలాడుతున్నారు
- రాళ్లు వేయకపోయినా వేసినట్టు నటిస్తున్నారు
- మేము తప్పు చేసినట్టు ప్రచారం చేస్తున్నారు
- జగన్ సంక్షేమ పథకాలే వైసీపీని గెలిపిస్తాయి
- వైసీపీకి ప్రజలు ఓటు వేసి జగన్ రుణం తీర్చుకోవాలి
తిరుపతి ఎన్నికల ప్రచారసభలో చంద్రబాబుపై రాళ్లదాడి జరగలేదనే విషయం తేలిపోయిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సానుభూతితో ఓట్లు పడతాయని చంద్రబాబు భావించారని ఎద్దేవా చేశారు.
ఆకుల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి చంద్రబాబు సభలో తాను షర్ట్ విసిరానని, రాయి విసరలేదని ఒప్పుకున్నాడని తెలిపారు. రాళ్లు వేయకపోయినా వేసినట్టు నటిస్తూ ఓట్లు వేయించుకోవాలనుకుంటున్నారని విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ అలిపిరి వద్ద ప్రమాణం చేసి హైడ్రామా సృష్టించారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఎన్నికల్లో ఓట్లు అడిగే దమ్ము లేక తండ్రీకొడుకులు ఇద్దరూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తామంతా తప్పు చేసినట్టు వదంతులు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. తాము ఎలాంటి తప్పు చేయలేదనే విషయం తిరుపతి ప్రజలకు తెలుసని అన్నారు.
ఓట్లు అడిగేందుకు తాము ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నామని... జగన్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నామని పెద్దిరెడ్డి చెప్పారు. మీ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నామని చెపుతూ ఓట్లు అడుగుతున్నామని తెలిపారు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించాలని ప్రజలను కోరుతున్నామని అన్నారు. గురుమూర్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించి, జగన్ రుణం తీర్చుకోవాలని ఓటర్లను కోరారు. గురుమూర్తి తల్లిదండ్రులు ఎస్సీలు అయినప్పుడు... ఆయన ఎస్సీ కాకుండా ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీలోనే సఖ్యత లేదని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేశ్ కు అందరూ వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. లోకేశ్ గురించి, టీడీపీ గురించి అచ్చెన్నాయుడు ఏం మాట్లాడారో సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయని అన్నారు.