Inter Exams: కరోనా ఎఫెక్ట్... తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు వాయిదా
- ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు
- నేరుగా సెకండియర్ లోకి ప్రవేశం
- పరిస్థితులు అనుకూలిస్తే ఫస్టియర్ పరీక్షలు
- సెకండియర్ పరీక్షలపై జూన్ లో తేదీలు ప్రకటించే అవకాశం
- ఎంసెట్ లో 25 శాతం ఇంటర్ మార్కుల వెయిటేజీ ఎత్తివేత
కరోనా వ్యాప్తి భయంతో ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను కూడా రద్దు చేసింది. ఇంటర్ సెకండియర్ పరీక్షలను మాత్రం వాయిదా వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు ఎలాంటి పరీక్షలు లేకుండానే నేరుగా సెకండియర్ లో ప్రవేశిస్తారని పేర్కొంది. పరిస్థితులు అనుకూలిస్తే భవిష్యత్తులో ఈ పరీక్షలు నిర్వహించే తేదీలు వెల్లడిస్తామని వివరించింది.
ఇక, మే 1 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించాల్సిన ఇంటర్ సెకండియర్ పరీక్షలను వాయిదా వేస్తున్నామని, జూన్ మొదటివారంలో పరిస్థితిని సమీక్షించి తేదీలు ప్రకటిస్తామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ వెల్లడించారు. తేదీల ప్రకటన తర్వాత పరీక్షలకు కనీసం 15 రోజుల సమయం ఉండేలా చూస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా, ఈ ఏడాది ఎంసెట్ లో ఇంటర్ మార్కుల్లో 25 శాతం వెయిటేజీని పరిగణనలోకి తీసుకోవడంలేదని ఉత్తర్వుల్లో వివరించారు.