Inflation: ఇండియాలో భారీగా పెరిగిన హోల్ సేల్ ధరలు!
- 7.39 శాతానికి చేరిన డబ్ల్యూపీఐ
- ఎనిమిదేళ్ల తరువాత ఇంతగా పెరగడం ఇదే తొలిసారి
- ప్రభావం చూపిన ఇంధనం, ఆహార ఉత్పత్తుల ధరలు
గత సంవత్సరం మార్చి నెలతో పోలిస్తే, ఈ సంవత్సరం మార్చిలో టోకు ధరల సూచిక భారీగా పెరిగింది. ప్రభుత్వ గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన సమాచారం ప్రకారం, మార్చిలో డబ్ల్యూపీఐ (హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్) 7.39 శాతంగా నమోదైంది. గడచిన ఎనిమిది సంవత్సరాల్లో నెలవారీ సూచికలో ఇంత భారీగా ద్రవ్యోల్బణం పెరగడం ఇదే మొదటి సారి. అక్టోబర్ 2012లో టోకు ధరల సూచి 7.4 శాతంగా నమోదైంది. ఆపై దాన్ని దాటి హోల్ సేల్ ధరలు పెరగడం ఇదే తొలిసారి.
క్రూడాయిల్ ధరలతో పాటు, లోహపు ధరలు పెరగడంతోనే మొత్తం సూచిక ప్రభావితం అయిందని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో గత సంవత్సరం కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులతో అతి తక్కువ ధరలు నమోదు కావడం కూడా ఈ సంవత్సరం సూచిక భారీగా పెరగడానికి కారణమైందని అన్నారు. 2020 మార్చిలో టోకు ధరల సూచిక కేవలం 0.42 శాతం మాత్రమే పెరగడం గమనార్హం.
కాగా, గడచిన మూడు నెలలుగా హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ పెరుగుతూ వచ్చింది. దీని ప్రభావం చిల్లర ధరలపై ఉండి నిత్యావసరాలు, పలు రకాల వస్తు ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. ఇక ఆహార ఉత్పత్తుల విషయానికి వస్తే, పప్పు ధాన్యాల ధరలు 13.14 శాతం, పండ్ల ధరలు 15.33 శాతం, ధాన్యం ధరలు 1.38 శాతం పెరిగాయి. ఇదే సమయంలో కూరగాయల ధరలు 5.19 శాతం పెరిగినట్టు గణాంకాల శాఖ వెల్లడించింది. ఇంధన ధరల్లో 10.25 శాతం వృద్ధి నమోదైంది.
టోకు ధరల సూచీలో 55 శాతం వాటాను కలిగివున్న మాన్యుఫాక్చరింగ్ రంగంలో ఇన్ ఫ్లేషన్ గత సంవత్సరంతో పోలిస్తే, 7.34 శాతంగా నమోదు కావడం గమనార్హం.