Raghu Rama Krishna Raju: వైయస్ షర్మిల జాకెట్ చిరిగిపోయేలా ప్రవర్తించడం చాలా దారుణం: రఘురామకృష్టరాజు

Raghu Rama Krishna Raju condemns police action on YS Sharmila

  • షర్మిల పట్ల మహిళా పోలీసులు దారుణంగా వ్యవహరించారు
  • బాధ్యులైన పోలీసులపై కేసీఆర్ చర్యలు తీసుకోవాలి
  • షర్మిలపై దాడిని ఖండిస్తూ విజయమ్మ చలించిపోయారు
  • అమరావతి మహిళలు కూడా ఆడబిడ్డలే అని విజయమ్మ గుర్తించాలి
  • జగన్ ప్రవర్తిస్తున్న తీరుపై విజయమ్మ స్పందించాలి

హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద నిన్న వైయస్ షర్మిల చేపట్టిన మూడు రోజుల నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. దీక్షకు ఒక్క రోజు అనుమతి మాత్రమే ఉందంటూ ఆమెను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా అక్కడ దారుణ పరిస్థితి నెలకొంది. షర్మిల జాకెట్ కూడా చిరిగిపోయింది. ఈ ఘటనపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రజల కోసం, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం షర్మిల చేపట్టిన దీక్ష సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలు తనను బాధించాయని చెప్పారు. ఉదయం నుంచి ఆమె ఏమీ తినలేదని... దీక్షా స్థలి నుంచి తన ఇంటి వరకు నడిచి వెళ్తానని ఆమె చెపితే నచ్చచెప్పాల్సింది పోయి దురుసుగా ప్రవర్తించారని అన్నారు. ఆమె జాకెట్ చిరిగిపోయేలా ప్రవర్తించడం చాలా దారుణమని మండిపడ్డారు. షర్మిల పట్ల మహిళా పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని అన్నారు.

షర్మిలపై అమానుషంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తాను డిమాండ్ చేస్తున్నానని రఘురాజు చెప్పారు. తనకు బాగా నచ్చిన నేతల్లో కేసీఆర్ ఒకరని... పోలీసులపై చర్యలకు ఆయన ఆదేశిస్తారనే తాను భావిస్తున్నానని అన్నారు. షర్మిలపై దాడిని ఖండిస్తూ ఆమె తల్లి విజయమ్మ చలించిపోయిన తీరు తనతో పాటు ఎంతో మందిని ఆలోచింపజేసిందని చెప్పారు. ఆ నిమిషం అందరికీ అమరావతి మహిళా రైతులు గుర్తుకొచ్చారని తెలిపారు.

షర్మిలకు నిరసన తెలిపే అవకాశాన్నైనా కేసీఆర్ ప్రభుత్వం కల్పించిందని.. ఏపీలో మహిళలకు నిరసన తెలిపే అవకాశాన్ని కూడా జగన్ సర్కారు ఇవ్వడం లేదని మండిపడ్డారు. అమరావతి మహిళల పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. అమరావతి మహిళలను దారుణంగా కొట్టి, రోడ్డు మీద పడేసి, డొక్కలో తన్ని, పశువుల మాదిరిగా వాహనాల్లో వేసుకుపోయిన ఘటనలు ఉన్నాయని విమర్శించారు.

షర్మిలకు జరిగిన అన్యాయం పట్ల చలించిపోయిన విజయమ్మకు అమరావతి మహిళలు గర్తుకు రాకపోవడం విచారకరమని అన్నారు. అమరావతి మహిళల పట్ల తన కుమారుడు జగన్ ప్రవర్తిస్తున్న తీరుపై కూడా విజయమ్మ స్పందించాలని వ్యాఖ్యానించారు. ఒక తల్లిగా విజయమ్మ బాధను అర్థం చేసుకోగలమని... అదే విధంగా అమరావతి మహిళలు కూడా ఆడబిడ్డలే అనే విషయాన్ని విజయమ్మ గుర్తించాలని కోరారు.

  • Loading...

More Telugu News