Raghu Rama Krishna Raju: ఏనాడూ మాస్క్ పెట్టుకోని జగన్.. ప్రజలను మాత్రం మాస్క్ పెట్టుకోమంటున్నారు: రఘురామకృష్ణరాజు
- జగన్ భావించిన దాని కంటే కరోనా సెకండ్ వేవ్ బలంగా ఉంది
- ఆచరణాత్మక కార్యాచరణను జగన్ చేపట్టాలి
- నందిగం సురేశ్ పై సీఐడీకి ఫిర్యాదు లేఖను పంపాను
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పించారు. పారాసిటమాల్ వేసుకుంటేనో, బ్లీచింగ్ పౌడర్ చల్లితేనో కరోనా పోతుందని కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో జగన్ చెప్పారని... ఆయన భావించిన దానికంటే సెకండ్ వేవ్ బలంగా ఉందని అన్నారు. తమ ఇంట్లోనే ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చిందని, తనను కూడా ఐసొలేషన్ లో ఉండాలని డాక్టర్లు సూచించారని చెప్పారు. ఏనాడూ మాస్క్ పెట్టుకోని జగన్ ప్రజలను మాత్రం మాస్కులు పెట్టుకోవాలంటున్నారని ఎద్దేవా చేశారు.
ఫోన్ చేసిన గంటలోనే కరోనా పేషెంట్లకు బెడ్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెపుతోందని... నిన్నటి వరకు ఏయే ఆసుపత్రుల్లో ఎంత మంది పేషెంట్లు చికిత్స పొందుతున్నారనే విషయాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు. కరోనా పేషెంట్లకు బెడ్లు దొరకడం లేదని ఎంతో మంది తనకు ఫోన్ చేసి చెపుతున్నారని తెలిపారు. కరోనాతో సహజీవనం చేయాలనే మాటలు చెప్పకుండా... ఆచరణాత్మక కార్యాచరణను జగన్ చేపట్టాలని సూచించారు.
ఇదిలావుంచితే, బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ పై ఏపీ సీఐడీ అధికారి సునీల్ కుమార్ కు ఒక ఫిర్యాదు లేఖను పంపానని రఘురాజు తెలిపారు. తనను కుక్క అన్నందుకు ఆ ఫిర్యాదు చేయలేదని... మదర్ ఫ్లోరా మినిస్ట్రీస్ అనే సంస్థతో సురేశ్ కు సంబంధాలు ఉన్నాయని... అడ్రస్ లేని సంస్థల నుంచి ఆ సంస్థకు డబ్బులు వస్తున్నాయని చెప్పారు.
ఎస్సీ సర్టిఫికెట్ తో రిజర్వుడు స్థానంలో ఎంపీ అయిన నందిగం సురేశ్... క్రైస్తవాన్ని పాటిస్తూ, ఆ మతాచారంలోనే పెళ్లి చేసుకున్నారని తెలిపారు. మతం మారిన తర్వాత ఆయన ఎస్సీ కాదని చెప్పారు. ఈ అంశాలపైనే సీఐడీకి తాను ఫిర్యాదు చేశానని తెలిపారు. సీఐడీ స్పందించకపోతే కేంద్ర సంస్థలను, కోర్టులను తాను ఆశ్రయిస్తానని చెప్పారు.