Nirav Modi: ఎట్టకేలకు నీరవ్ మోదీ అప్పగింతకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకారం
- ఆదేశాలపై సంతకం చేసిన హోంశాఖ సెక్రటరీ
- భారత్‌కు అప్పగించాలని ఫిబ్రవరిలోనే కోర్టు తీర్పు
- తప్పించుకునేందుకు నీరవ్‌కు ఇంకా కొన్ని మార్గాలు
- పీఎన్‌బీకి రూ.14వేల కోట్లు మోసం చేసిన నీరవ్
భారత్‌లో మనీలాండరింగ్, రుణఎగవేత కేసుల్లో కీలక నిందితుడిగా ఉండి లండన్ పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. ఈ మేరకు అప్పగింత ఆదేశాలపై యూకే హోం సెక్రటరీ ప్రీతి పటేల్ గురువారం సంతకం చేశారు.
దీంతో నీరవ్ మోదీని భారత్‌కు రప్పించే ప్రక్రియ దాదాపు దగ్గరపడింది. అయితే, ఇప్పటికీ నీరవ్ మోదీకి తప్పించుకునేందుకు అనేక అవకాశాలు ఉన్నాయి. 28 రోజుల్లోగా బ్రిటన్ ప్రభుత్వ ఆదేశాలను సవాల్ చేస్తూ నీరవ్ అక్కడి హైకోర్టును సంప్రదించే వెసులుబాటు ఉంది. ఈ ప్రక్రియ కొన్ని నెలలు లేదా సంవత్సరాలు కూడా పట్టొచ్చు. కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యా విషయంలో ఇదే జరిగింది.
భారత్‌కు తిరిగి రాకుండా ఉండేందుకు నీరవ్ మోదీ అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ, అవన్నీ విఫలమయ్యాయి. భారత్‌లో తనకు న్యాయం జరగదనీ, కొవిడ్ నేపథ్యంలో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నానంటూ చేసిన విజ్ఞప్తులన్నింటినీ కోర్టు కొట్టిపారేసింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడన్న భారత ఆధారాలతో ఏకీభవించిన అక్కడి న్యాయస్థానం.. భారత్‌కు అప్పగించే విషయంపై ఆదేశాలు జారీ చేయాలని ఆదేశిస్తూ హోంశాఖకు ఫిబ్రవరిలోనే సూచించింది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ)ను రూ.14,000 కోట్ల మేర మోసం చేసిన కేసులో నీరవ్ మోదీ ప్రధాన నిందితుడు. ఈ వ్యవహారంలో ఆయనపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేయగా.. అవినీతి ఆరోపణల కింద సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఆయనకు చెందిన కొన్ని ఆస్తులను దర్యాప్తు సంస్థలు జప్తు కూడా చేశాయి.