Chandrababu: అమరావతి భూముల వ్యవహారంలో చంద్రబాబుకు హైకోర్టులో స్వల్ప ఊరట!
- అసైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబు, నారాయణలపై సీఐడీ కేసు
- కేసును కొట్టేయాలంటూ హైకోర్టు క్వాష్ పిటిషన్ వేసిన బాబు, నారాయణ
- మరో మూడు వారాల పాటు దర్యాప్తు చేయవద్దని ఆదేశించిన హైకోర్టు
అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. వారిద్దరిపై సీఐడీ నమోదు చేసిన కేసు దర్యాప్తుతో పాటు తదుపరి చర్యలన్నింటినీ మరో మూడు వారాల పాటు ఆపేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సీఐడీ తమపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలంటూ చంద్రబాబు, నారాయణ ఏపీ హైకోర్టులో గతంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు తదుపరి చర్యలను నాలుగు వారాల పాటు నిలిపివేస్తూ అప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు తాజాగా జరిగిన ఈ కేసు విచారణలో ఈ ఉత్తర్వులను మరో మూడు వారాల పాటు పొడిగించింది. తదుపరి విచారణను ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.