West Bengal: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో అప్రమత్తమైన ఎన్నికల సంఘం.. బెంగాల్‌లో ప్రచార కార్యక్రమాలపై కఠిన ఆంక్షలు!
- బెంగాల్‌లో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి
- రాత్రి 7 గంటల నుంచి ఉదయం 10గంటల వరకు ప్రచారంపై ఆంక్షలు
- పోలింగ్ ప్రారంభానికి 72 గంటల ముందే ప్రచారం బంద్
- ప్రచారంలో కార్యకర్తలకు పార్టీలే మాస్కులు, శానిటైజర్లు అందజేయాలి
కరోనా కేసుల ఉద్ధృతి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అప్రమత్తమైంది. మహమ్మారి కట్టడికి పలు ఆంక్షలు ప్రకటించింది. పోలింగ్ జరుగుతున్న పశ్చిమ బెంగాల్‌లో ప్రచారంపై ఆంక్షలు విధించింది. ప్రచార సమయాన్ని మూడు గంటలు కుదించింది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు ప్రచార ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించొద్దని ఆదేశించింది. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి రానున్నాయని తెలిపింది.
ఇక పోలింగ్ ప్రారంభానికి 72 గంటల ముందే ప్రచార కార్యక్రమాలకు స్వస్తి పలకాలని ఈసీ ఆదేశించింది. ఈసీ తాజా ఆదేశాలతో సాయంత్రం 7 గంటల తర్వాత జరగాల్సిన అమిత్ షా మూడు టౌన్ హాల్ కార్యక్రమాలు, జేపీ నడ్డా నిర్వహించాల్సిన రెండు ఇతర కార్యక్రమాలు రద్దు కానున్నాయి.
ఇక ఎన్నికల ప్రచార ర్యాలీలు, బహిరంగ సభలకు హాజరయ్యే కార్యకర్తలందరికీ రాజకీయ పార్టీలే మాస్కులు, హాండ్ శానిటైజర్లు అందజేయాలని ఈసీ ఆదేశించింది. కొవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించే కార్యక్రమాలను రద్దు చేస్తామని స్పష్టం చేసింది. స్టార్ క్యాంపెయినర్లు, పార్టీ ముఖ్య నేతలు, అభ్యర్థులు కొవిడ్ నిబంధనలు పాటించే విషయంలో కార్యకర్తలకు ఆదర్శంగా ఉండాలని సూచించింది.
ప్రచారంలో పాల్గొనే వారిని నిరంతరం అప్రమత్తం చేయాలని హితవు పలికింది. ఇక మిగతా మూడు విడతల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి ఈసీ ససేమిరా అంటోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ పోలింగ్ విడతల సంఖ్యను కుదించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.
పశ్చిమ బెంగాల్‌లో గురువారం 6,796 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇప్పటి వరకు నిర్ధారణ అయిన కేసుల సంఖ్య 6,36,885కు పెరిగింది. ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేస్తున్న వివిధ పార్టీలకు చెందిన ఐదుగురు నాయకులు కరోనా బారినపడ్డారు.