Adar Poonawalla: టీకా తయారీకి కావాల్సిన ముడిపదార్థాల ఎగుమతులపై నిషేధం ఎత్తివేయండి: అమెరికాను కోరిన అదర్ పూనావాలా
- ట్విట్టర్ వేదికగా బైడెన్‌కు సమాచారం
- తయారీని వేగవంతం చేయాలంటే నిషేధం ఎత్తివేయాల్సిందే
- అడ్డంకిగా మారిన రక్షణ చట్టం
- టీకా ఎగుమతుల్లో జాప్యం జరిగే అవకాశం
కరోనాను నిరోధించే కొవిషీల్డ్ టీకా ఉత్పత్తిని భారత్‌లో వేగవంతం చేయాలంటే ముడిపదార్థాల ఎగుమతులపై విధించిన ఆంక్షల్ని వెంటనే ఎత్తివేయాలని అమెరికాను సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా కోరారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా అధ్యక్షుడు జో బైడెన్‌కు సమాచారం అందజేశారు. కొవిడ్‌ను అంతం చేయడంలో అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలంటే ఎగుతులపై నిషేధం ఎత్తివేయాల్సిందేనని స్పష్టం చేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ సంస్థ అయిన సీరం.. ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా టీకా కొవిషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తోంది. దేశీయ అవసరాలతో పాటు ఇతర దేశాలకు కూడా టీకాలను ఎగుమతి చేస్తోంది. అయితే, కరోనా ఉద్ధృతి నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం రక్షణ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో అత్యవసర సమయంలో దేశీయంగా టీకాల తయారీకి కావాల్సిన ముడిపదార్థాల ఎగుమతులపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కొవిషీల్డ్ టీకా తయారీకి కావాల్సిన ముడిపదార్థాలు అమెరికా నుంచి అందడం లేదు.