Iran: అంతర్జాతీయ ఒత్తిళ్లు బేఖాతరు.. అణ్వస్త్రాలు సమకూర్చుకునే దిశగా ఇరాన్!
- యురేనియాన్ని 60 శాతం మేర శుద్ధిచేసే చర్యలు
- ప్రకటించిన ఇరాన్ స్పీకర్
- పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొంటాయన్న నిపుణులు
నతాంజ్‌లోని అణుశుద్ధి కర్మాగారంపై ఇజ్రాయెల్ చేసినట్టుగా భావిస్తున్న సైబర్ దాడి తర్వాత ఇరాన్ వైఖరిలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అణ్వస్త్రాలను సమకూర్చుకోవాలని ఆ దేశం నిర్ణయించింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ ఒత్తిళ్లను పక్కనపెట్టి మరీ అణు కార్యక్రమాన్ని చేపట్టింది.
అణ్వస్త్రాల తయారీలో కీలకమైన యురేనియాన్ని 60 శాతం మేర శుద్ధి చేసేందుకు ప్రణాళికలు రచించి అణ్వస్త్రం దిశగా అడుగులు ముందుకు వేస్తోంది. యురేనియం శుద్ధి స్థాయిని పెంచుతున్నట్టు ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాగేర్ ఖాలిబాఫ్ ప్రకటించారు. ఇరాన్ నిర్ణయంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నతాంజ్ అణుశుద్ధి కర్మాగారంపై సైబర్ దాడి తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి.