ICC: హైదరాబాద్​ లోనూ టీ20 వరల్డ్​ కప్​ మ్యాచ్​.. వేదికలను ఖరారు చేసిన బీసీసీఐ!

BCCI Finalized The Venues for ICC T20 World Cup
  • అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్
  • మొత్తం 8 వేదికల్లో మ్యాచ్ లు
  • పాక్ క్రికెటర్ల వీసా సమస్యలు
  • వీసా ఇచ్చేందుకు కేంద్రం సమ్మతి
  • అపెక్స్ కౌన్సిల్ కు చెప్పిన జై షా
టీ20 ప్రపంచకప్ మ్యాచ్ లకు వేదికలను బీసీసీఐ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఫైనల్ సహా మ్యాచ్ లను 8 వేదికల్లో నిర్వహించనున్నట్టు సమాచారం. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడొకరు ఈ వివరాలను వెల్లడించారు. అక్టోబర్ నుంచి జరగనున్న టీ20 క్రికెట్ వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.

టోర్నీ ఫైనల్ ను అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించనున్నట్టు ఆ సభ్యుడు తెలిపారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా, బెంగళూరు, ధర్మశాల స్టేడియాలు మ్యాచ్ లకు ఆతిథ్యం ఇస్తాయన్నారు. ఇటు బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పాకిస్థాన్ క్రికెట్ టీం.. ఇండియాకు రావడానికీ అడ్డంకులు దాదాపుగా తొలగిపోయినట్టు సమాచారం.

పాక్ క్రికెటర్లకు కేంద్ర ప్రభుత్వం వీసాలు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అపెక్స్ కౌన్సిల్ కు బీసీసీఐ సెక్రటరీ జై షా వివరించారని అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు చెప్పారు. ‘‘పాక్ క్రికెటర్ల వీసా సమస్య తొలగిపోయినట్టే. అయితే, విదేశీ క్రికెట్ అభిమానులకు అనుమతినిస్తారా? లేదా? అన్న దానిపై మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం జరగలేదు’’ అని ఆయన వివరించారు. త్వరలోనే అభిమానులను అనుమతించే విషయంపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

కాగా, కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉందన్న కారణంతో హైదరాబాద్ ను ఐపీఎల్ మ్యాచ్ లకు ఎంపిక చేయని సంగతి తెలిసిందే. తాజాగా టీ20 వరల్డ్ కప్ కు హైదరాబాద్ నూ వేదికగా ఎంపిక చేశారు.
ICC
T20 World Cup
Ahmedabad Stadium
Narendra Modi Stadium
Hyderabad
BCCI

More Telugu News