train: కరోనా టెస్టులు వద్దంటూ వందలాది మంది ప్రయాణికుల పరుగో పరుగు.. వీడియో ఇదిగో
- బీహార్‌లోని బక్సర్ రైల్వే స్టేషన్ లో ఘటన
- ప్రయాణికులకు ఉచితంగా టెస్టులు
- చేయంచుకోబోమని చెబుతున్న ప్రయాణికులు
కరోనా పరీక్షలు చేయించుకోవడానికి ప్రజలు ఎంతగా భయపడుతున్నారన్న దానికి ఇదో ఉదాహరణ. కరోనా పరీక్షలు చేయించుకున్నాక పాజిటివ్ అని తేలితే, ఇంట్లోనే క్వారంటైన్లో ఉండాల్సి వస్తుందనే భయపడుతున్నారు తప్ప.. తమ వల్ల ఇతరులకు సోకకూడదన్న బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు.
రైలు ప్రయాణాలు చేస్తోన్న వారికి కొందరు స్టేషన్లలో రాండమ్‌గా ఉచితంగా టెస్టులు నిర్వహిస్తున్నారు. అయితే, అందుకు ప్రయాణికులు సహకరించడం లేదు. తాజాగా, బీహార్‌లోని బక్సర్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులు పరుగులు తీశారు. తమను ఎవరో మారణాయుధాలతో వెంటాడుతున్న రీతిలో వందలాది మంది ప్రయాణికులు పారిపోయారు.
ఉచితంగా కరోనా టెస్టులు చేస్తామని, చేయించుకుంటే మీకే మంచిదని ఆరోగ్య సిబ్బంది చెబుతున్నప్పటికీ వారికి చిక్కకుండా పరుగులు తీశారు. కరోనా విజృంభణ నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి చాలా మంది వలస కార్మికులు తిరిగి బీహార్ చేరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఓ రైల్వే స్టేషన్లో కనపడిన దృశ్యాన్ని ఓ జర్నలిస్టు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా ఈ వీడియో వైరల్ అవుతోంది. పరీక్షలు చేయించుకోవాలని అడిగితే తమతో చాలా మంది గొడవ పడుతున్నారని వైద్య సిబ్బంది చెప్పారు. ప్రయాణికులు చాలా మంది పరుగులు తీస్తుండడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు.