Gujarath High Court: సిగ్గుపడొద్దు.. కరోనాకు సంబంధించిన పక్కా వివరాలను ప్రకటించండి: గుజరాత్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
- కరోనా పేషెంట్లు పెరగడానికి ప్రభుత్వం కారణం కాదు
- సమాచారాన్ని దాస్తే.. మరిన్ని సమస్యలు వస్తాయి
- ప్రజల పట్ల ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలి
- ప్రభుత్వం ఇస్తున్న సమాచారం సరికాదనే అభిప్రాయాన్ని తొలగించాలి
- కచ్చితమైన డేటాను విడుదల చేయండి
దేశ వ్యాప్తంగా ప్రతి రోజు భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కేసులు, టెస్టులకు సంబంధించి సరైన సమాచారం ఇవ్వడం లేదనే అనుమానం ప్రతి ఒక్కరిలో ఉంది. గుజరాత్ హైకోర్టు కూడా ఇదే విషయాన్ని లేవనెత్తింది.
కరోనా మరణాలకు సంబంధించిన పక్కా వివరాలను ప్రకటించాలని... ప్రజలకు సరైన సమాచారాన్ని అందించాలని గుజరాత్ ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. కచ్చితమైన లెక్కలతో ఆర్టీపీసీఆర్ టెస్టుల వివరాలను, పాజిటివ్ కేసుల సంఖ్యను విడుదల చేయాలని తెలిపింది. కరోనా టెస్టుల ఫలితాల కచ్చితమైన వివరాలను ఇవ్వడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది.
కరోనాకు సంబంధించిన వివరాలను దాచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ప్రయోజనం ఏమీ లేదని హైకోర్టు తెలిపింది. పక్కా సమాచారాన్ని దాచడం మరిన్ని సీరియస్ సమస్యలకు కారణమవుతుందని... ప్రజల్లో భయం, నమ్మకాన్ని కోల్పోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని పేర్కొంది.
పరిస్థితులు సక్రమంగా ఉండాలంటే... ప్రజల పట్ల ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలని హితవు పలికింది. కరోనా పేషెంట్ల పెరుగుదలకు ప్రభుత్వం కారణం కాదని వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న డేటా సరైనది కాదనే ప్రజల అభిప్రాయాన్ని తొలగించాలంటే... కచ్చితమైన వివరాలను విడుదల చేయాలని సూచించింది.