KTR: జీహెచ్ఎంసీతో పాటు అన్ని మున్సిపాలిటీల్లో సోడియం హైపోక్లోరేట్ ను పిచికారి చేయండి: కేటీఆర్ ఆదేశం
- అవసరమైన చోట ఇతర వాహనాలను అద్దెకు తీసుకుని పిచికారి చేయండి
- దీని కోసం పట్టణ ప్రగతి నిధులను వినియోగించండి
- అందరూ మాస్కులు ధరించేలా చూడండి
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను చేపడుతోంది. కోవిడ్ మళ్లీ ప్రబలుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ మరియు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో యుద్ధ ప్రాతిపదికన క్రిమిసంహారక ద్రావకం సోడియం హైపోక్లోరైట్ ను పిచికారి చేయాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ శాఖ వద్ద ప్రస్తుతం ఉన్న వాహనాలతో పాటు అవసరమైన చోట ఇతర వాహనాలను అద్దెకు తీసుకుని పిచికారి చేయాలని చెప్పారు. ఈ పనుల కోసం పట్టణ ప్రగతి నిధులను వినియోగించాలని సూచించారు.
కరోనా తీవ్రత ఉన్నందున శాఖ పరిధిలో ఉన్న ఎంటమాలజిస్టులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, మున్సిపల్ శాఖలో ఉన్న ఉద్యోగులు అందరు విధులకు హాజరు కావాలని, సెలవులు రద్దు చేయాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. దీనితో పాటు కోవిడ్ నియంత్రణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకునేలా ప్రజల్లో అవగాహన కూడా కల్పించాలని, ప్రజలందరూ ఎల్లవేళలా మాస్కు ధరించేలా చూడాలని మంత్రి కేటీఆర్ అధికారులను కోరారు.
మున్సిపల్ శాఖ సిబ్బంది కరోనాపై పోరులో ముందువరుసలో ఉన్నందున శాఖ ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ చేయించాలని ఉన్నతాధికారులకు కేటీఆర్ సూచించారు. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు రేపటికల్లా వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి అవుతుందని, మిగతా పురపాలికల్లో కూడా ఇంకో 2, 3 రోజుల్లో ఉద్యోగులు అందరికీ వ్యాక్సినేషన్ చేయిస్తామని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి తెలియజేశారు. మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, కమీషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ సత్యనారాయణ, జీ.హెచ్.ఎం.సీ కమీషనర్ లోకేశ్ కుమార్ లతో కేటీఆర్ ఇవ్వాళ ఫోన్లో మాట్లాడారు.