Polling: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఉప ఎన్నికల పోలింగ్

Polling concludes in Tirupati and Nagarjunasagar by polls
  • నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో ముగిసిన పోలింగ్
  • సాయంత్రం 6 గంటల వరకు 84 శాతం పోలింగ్ నమోదు
  • తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికలో ముగిసిన ఓటింగ్
  • సాయంత్రం 5 గంటల వరకు 55 శాతం పోలింగ్
తెలుగు రాష్ట్రాల్లో నేడు రెండు చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. ఏపీలో తిరుపతి పార్లమెంటు స్థానానికి, తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు చేపట్టారు. సాయంత్రం 6 గంటల సమయానికి సాధారణ ఓటింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల సమయానికి క్యూలో ఉన్న వారికి, కొవిడ్ బాధితులకు 7 గంటల వరకు ఓటేసే అవకాశం కల్పించారు.

ఇక తిరుపతి పార్లమెంటు స్థానంలో సాయంత్రం 5 గంటల వరకు 55 శాతం పోలింగ్ జరిగింది. 2,470 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మే 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. తిరుపతి బరిలో వైసీపీ తరఫున డాక్టర్ గురుమూర్తి, టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ, కాంగ్రెస్ అభ్యర్థిగా చింతా మోహన్ పోటీ చేశారు. వైసీపీ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతితో ఇక్కడ ఉప ఎన్నిక చేపట్టారు.

అటు, నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో భారీగా ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల సమయానికి 84.32 శాతం ఓటింగ్ జరిగినట్టు అధికారులు వెల్లడించారు. నాగార్జునసాగర్ బరిలో టీఆర్ఎస్ తరఫున నోముల భగత్, కాంగ్రెస్ పార్టీ నుంచి జానారెడ్డి, బీజేపీ అభ్యర్థిగా పానుగోతు రవికుమార్ నాయక్ బరిలో దిగారు. దివంగత నేత నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జునసాగర్ లో ఉప ఎన్నిక వచ్చిన సంగతి తెలిసిందే.
Polling
Nagarjuna Sagar Bypolls
Tirupati LS Bypolls
Andhra Pradesh
Telangana

More Telugu News