Panabaka Lakshmi: స్కూలుకు వెళ్లే పిల్లలు కూడా ఓటేయడం ఈ ఎన్నికల ప్రత్యేకత: పనబాక లక్ష్మి వ్యంగ్యం
- ముగిసిన తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక
- బయటి వ్యక్తులు ఓటేశారన్న టీడీపీ అభ్యర్థి పనబాక
- కుటీర పరిశ్రమలా నకిలీ కార్డులు తయారుచేశారని ఆరోపణ
- తమ ఏజెంట్లపై కేసులు నమోదు చేశారని వెల్లడి
తిరుపతి ఉప ఎన్నిక బరిలో బయటి వ్యక్తులు వచ్చి ఓట్లేశారంటూ విపక్షాలు ముక్తకంఠంతో ఆరోపిస్తుండగా, బస్సుల్లో ప్రయాణం చేస్తున్న వారిని కూడా దొంగ ఓటర్లుగా ముద్ర వేస్తున్నారంటూ ఆ ఆరోపణలను వైసీపీ తిప్పికొట్టిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేటి పోలింగ్ లో స్కూలుకు వెళ్లే పిల్లలు కూడా ఓటేయడం ఈ ఎన్నికల ప్రత్యేకత అని వ్యంగ్యం ప్రదర్శించారు. కుటీర పరిశ్రమ తరహాలో నకిలీ ఓటరు కార్డులు తయారు చేశారని వ్యాఖ్యానించారు.
ఎన్నికల్లో బయటి వ్యక్తులు ఓట్లేశారని, తిరుపతి, ఓజిలి ప్రాంతాల్లో రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. కోట ప్రాంతంలోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. బోగస్ ఓటర్లను నిరోధించేందుకు ప్రయత్నించిన తమ ఏజెంట్లపై కేసులు నమోదు చేశారని పనబాక లక్ష్మి వెల్లడించారు.