USA: కమలా హారిస్ ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చిన యూఎస్ నర్స్... అరెస్ట్
- ఫ్లోరిడాలో నర్సుగా పని చేస్తున్న నివియనీ ఫిట్టిట్
- కమలా హారిస్ ను చంపేస్తానని వీడియోలు
- అరెస్ట్ చేసిన యూఎస్ సీక్రెట్ సర్వీస్
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ను చంపేస్తానని బెదిరించిన 39 ఏళ్ల నర్సును పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎన్ఎన్ ప్రచురించిన ప్రత్యేక కథనం ప్రకారం, ఫ్లోరిడాలో పనిచేస్తున్న నర్సు నివియనీ పిట్టిట్ ఫెల్ఫ్స్, కమలా హారిస్ ను హత్య చేస్తానని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో విచారణ జరిపిన యూఎస్ సీక్రెట్ సర్వీస్, ఆమెను అరెస్ట్ చేసింది. గత సంవత్సరం జరిగిన ఎన్నికల తరువాత కమలా హారిస్, యూఎస్ కు తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు స్వీకరించారన్న సంగతి తెలిసిందే.
ఫ్లోరిడాలోని సదరన్ డిస్ట్రిక్ట్ లో ఉన్న యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్టులో దాఖలైన క్రిమినల్ కంప్లయింట్ మేరకు ఫిబ్రవరి 13 నుంచి 18 వరకూ ఫెల్ఫ్స్, కమలా హారిస్ ను బెదిరించారు. ఆమెను చంపుతానని, కుదరకుంటే హాని తలపెట్టేందుకు సిద్ధమని వ్యాఖ్యానిస్తూ వీడియోలు విడుదల చేసింది. 2001 నుంచి జాక్సన్ హెల్త్ సిస్టమ్స్ లో ఆమె పని చేస్తున్నట్టు విచారణ అధికారులు తెలిపారు.
"కమలా హారిస్ నువ్వు చనిపోబోతున్నావు. నీకు రోజులు దగ్గర పడ్డాయి" అని ఆమె వ్యాఖ్యానించిన వీడియోలు వైరల్ అయ్యాయి. మరో వీడియోలో, "తుపాకితో నిన్ను కాల్చగలిగేంత దగ్గరగా నేను రానున్నాను. దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నాను. ఈ రోజు నీది కావచ్చు. కానీ, మరో 50 రోజుల్లో నీకు మరణం తథ్యం. ఇప్పటి నుంచి రోజులు లెక్కబెట్టుకో" అని వ్యాఖ్యానించింది. అదే నెలలో ఆమె ఆయుధాలను ధరించేందుకు అధికారులను అనుమతి కోరడం గమనార్హం. కాగా, ఆమె నల్లజాతి స్త్రీ కావడమే ఫెల్ఫ్స్ ఆగ్రహానికి, ఈ బెదిరింపులకు కారణమని తెలుస్తోంది.