Corona Virus: కొవిడ్‌పై ప్రజలు విసుగెత్తిపోవడం వల్లే మాస్కులు ధరించడం లేదు: ప్రొఫెసర్ అనూప్ మలానీ
- వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన వైరస్ నుంచి రక్షణ లభించదు
- వ్యాక్సిన్ వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది
- వారి నుంచి వైరస్ ఇతరులకు సంక్రమించే ముప్పు తక్కువగా ఉంటుంది
కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం శరవేగంగా టీకాలు వేస్తోంది. 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరు టీకాలు వేయించుకోవాలని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ప్రపంచంలో ఎక్కడా లేనంత వేగంగా దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే, టీకా వేసుకున్నంత మాత్రాన వైరస్ సోకదని చెప్పలేమని ఆరోగ్య, అభివృద్ధి వ్యవహారాల ఆర్థికవేత్త ప్రొఫసర్ అనూప్ మలానీ పేర్కొన్నారు.
అయితే, టీకా తీసుకున్న వ్యక్తిలో వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు, వేగంగా నయం అయేందుకు వ్యాక్సిన్ సాయపడుతుందని చెప్పారు. షికాగో విశ్వవిద్యాలయం లా స్కూల్, ప్రిట్జ్‌కర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో బోధనా విధులు నిర్వర్తిస్తున్న అనూప్ ఐడీఎఫ్‌సీ మేధోమథన సంస్థతో కలిసి భారత్‌లో కొవిడ్‌పై సీరో అధ్యయనం చేస్తున్నారు. ఒకసారి కొవిడ్ సోకి బయటపడినా, టీకా వేయించుకున్నా మళ్లీ వైరస్ సోకదని చెప్పలేమని, అయితే ఈ రెండింటి వల్ల పెరిగే రోగ నిరోధకశక్తి చాలా ఉపయోగకరమని వివరించారు.
ఇలాంటి వారికి ఇన్ఫెక్షన్ సోకినా త్వరగా కోలుకునేందుకు వీలుంటుందని వివరించారు. మరణాలు, తీవ్ర అనారోగ్యాన్ని తగ్గించొచ్చని పేర్కొన్నారు. అంతేకాదు, అలాంటి వారి నుంచి ఇతరులకు వైరస్ సంక్రమించే ముప్పు కూడా తక్కువగా ఉంటుందన్నారు.
మాస్కులు ధరించకుండా గుంపులుగా ఒకే దగ్గరికి చేరడం, త్వరగా వ్యాప్తి చెందే కొత్త వైరస్ రకాలు రావడం వంటి వాటి వల్ల వ్యాధి త్వరగా వ్యాప్తి చెందుతోందన్నారు. కొవిడ్‌పై ప్రజలు విసుగెత్తిపోవడం, టీకా కార్యక్రమం వల్ల ప్రజలు మాస్కులు ధరించడం లేదన్నారు. వ్యాక్సిన్ తీసుకోనప్పటికీ చాలామంది ఇలాంటి భావనతోనే ఉన్నారని అనూప్ మలానీ పేర్కొన్నారు.