Corona Virus: కరోనా వైరస్‌పై పోరాడే మానవ జన్యువులను గుర్తించిన శాస్త్రవేత్తలు
- కాలిఫోర్నియా శాస్త్రవేత్తల పరిశోధన
- వైరస్‌పై పోరాడుతున్న ఇంటర్‌ఫెరాన్ల జన్యువులు
- తొలి అంచెలో రక్షణ కవచంగా పనిచేస్తున్నాయన్న శాస్త్రవేత్తలు
కరోనా మహమ్మారిపై పోరాడే మానవ జన్యువులను గుర్తించేందుకు కాలిఫోర్నియాలోని శాన్‌ఫోర్డ్ బర్న్‌హామ్ ప్రెబిస్ మెడికల్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధన ఫలితాన్నిచ్చింది. వైరస్‌పై పోరాడే ఇంటర్‌ఫెరాన్లకు సంబంధించిన జన్యువులను గుర్తించారు. వైరస్‌పై పోరులో తొలి అంచెలో ఇవి రక్షణ వ్యవస్థగా ఉపయోగపడుతున్నట్టు తేలింది. ఈ పరిశోధనకు భారత సంతతికి చెందిన సుమిత్ కె చందా నేతృత్వం వహించారు. కరోనా వ్యాధిగ్రస్థులు కొందరిలో ఇంటర్‌ఫెరాన్ స్పందన బలహీనంగా ఉన్నట్టు పరిశోధనలో తేలింది. ఫలితంగా వారిలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.
కొవిడ్ ఇన్ఫెక్షన్‌ను పరిమితం చేసే సామర్థ్యం ఇంటర్‌ఫెరాన్‌లతో ప్రేరేపితమయ్యే ‘ఇంటర్‌ఫెరాన్ స్టిమ్యులేటెడ్ జీన్స్’ (ఐఎస్‌జీ)లకు ఉన్నట్టు పరిశోధనలో తేలింది. అలాగే ఈ వ్యాధిని మొత్తంగా 65 ఐఎస్‌జీలు నియంత్రిస్తున్నట్టు గుర్తించారు. వీటిలో కొన్నింటికి వైరస్ సామర్థ్యాన్ని అడ్డుకునే శక్తి ఉందన్నారు. మరికొన్ని వైరస్‌లోని జన్యు పదార్థమైన ఆర్ఎన్ఏ తయారీని నిలువరిస్తున్నట్టు సుమిత్ తెలిపారు. మిగతావి వైరస్ కూర్పునకు అడ్డుకట్ట వేస్తున్నట్టు చెప్పారు. తాజా పరిశోధనలో వెలుగు చూసిన అంశాలను లక్ష్యంగా చేసుకుని మరింత మెరుగైన ఔషధాలను అభివృద్ధి చేయనున్నట్టు సుమిత్ వివరించారు.