Kumbhamela: ముగిసిన కుంభమేళా... అధికారిక ప్రకటన!
- ప్రకటించిన స్వామి అవధేనంద గిరి
- మోదీతో మాట్లాడిన తరువాత నిర్ణయం
- భక్తులు లేకుండా షాహీ స్నానాలు
- దైవ పూజలు కొనసాగుతాయని వెల్లడి
ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి మేరకు హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళాను ముగిస్తున్నామని, మిగతా రోజుల్లో భక్తులు లేకుండా నామమాత్రంగా వేడుక జరుగుతుందని స్వామి అవధేశానంద గిరి వెల్లడించారు. "మా లక్ష్యం ఒక్కటే. భక్తులను కొవిడ్ నుంచి కాపాడటం. దేశంలో వ్యాపిస్తున్న కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. కుంభమేళా ముగిసింది. అందరు దేవుళ్లకూ జరగాల్సిన పూజలు, నిమజ్జనాలు జరుగుతాయి" అని అవధేశానంద గిరి తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
ఆపై ఓ వీడియో మెసేజ్ ని విడుదల చేసిన ఆయన, మిగతా సాధువులు, ఆలయాల ధర్మకర్తలు కూడా పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే లక్షలాది మంది పవిత్ర స్నానాలను ఆచరించారని, మిగతా షాహీ స్నాన్ వేడుకలు భక్తులు లేకుండా జరుగుతాయని అన్నారు.
కాగా, ఈ నెల 1న కుంభమేళా ప్రారంభమైన సంగతి తెలిసిందే. హరిద్వార్ కు చేరుకున్న లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తుంటే, వేలాది మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. దీంతో కుంభమేళాను నిలిపివేయాలని సర్వత్రా డిమాండ్ వచ్చింది. అయితే, ఉత్సవాలను ఆపేందుకు తొలుత నిరాకరించిన ప్రధాన సాధువులు, ఆపై మనసు మార్చుకున్నారు. నరేంద్ర మోదీతో ఫోన్ లో మాట్లాడిన తరువాత స్వామి అవధేశానంద గిరి కుంభమేళాను ముగిస్తున్నట్టు ప్రకటించారు.