Pakistan: పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు.. మహ్మద్ ప్రవక్తను అవమానిస్తే ఊరుకోబోమని హెచ్చరిక
- దైవ దూషణను ముస్లింలు క్షమించరని వ్యాఖ్య
- విదేశీ తీవ్రవాదులంటూ తీవ్ర వ్యాఖ్యలు
- పాశ్చాత్య దేశాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్
పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహ్మద్ ప్రవక్త గురించి నోటికొచ్చినట్టు మాట్లాడి అవమానిస్తే ప్రపంచంలోని ముస్లింలు అస్సలు క్షమించరని అన్నారు. యూధుల త్యాగాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకున్నట్టే.. మహ్మద్ ప్రవక్త గురించి చెడుగా మాట్లాడే వారిపైనా పాశ్చాత్య దేశాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహ్మద్ ప్రవక్తను అగౌరవపరుస్తూ ముస్లింలను ఉద్దేశపూర్వకంగా చెడ్డవారిని చేస్తున్నారని ఆయన అన్నారు.
ముస్లింలు దైవదూషణను అస్సలు క్షమించరని, మహ్మద్ ప్రవక్తను అవమానిస్తే ఊరుకోబోరని అన్నారు. యూధుల త్యాగాలకు వ్యతిరేకంగా మాట్లాడే వారిపై చర్యలు తీసుకునేందుకు పలు పాశ్చాత్య దేశాలు చట్టాలు చేశాయని గుర్తు చేశారు. అలాగే ముస్లింల గురించి చెడు ప్రచారం చేసే వారిపైనా చర్యలు తీసుకునేందుకు చట్టాలు చేయాలన్నారు. ఇస్లామోఫోబియాతో రెచ్చిపోతున్న విదేశీ తీవ్రవాదులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 130 కోట్ల మంది ముస్లింలను బాధిస్తున్నారన్నారు.
అలాంటి తీవ్రవాదులంతా మహ్మద్ ప్రవక్తను ముస్లింలు ఎంత ప్రేమిస్తారో, ఆరాధిస్తారో తెలుసుకోవాలని హితవు చెప్పారు. కాబట్టి ప్రవక్తను అవమానిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పాశ్చాత్య దేశాల్లోని రైట్ వింగ్ రాజకీయ నాయకులు, తీవ్రవాదులు ముస్లింలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. భావ స్వేచ్ఛ హక్కు పేరిట నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.