Corona Virus: కరోనా కట్టడి ఆంక్షలు వ్యాక్సినేషన్‌కు అడ్డుకాకూడదు: కేంద్రం
- రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసిన కేంద్రం
- ఆంక్షల వల్ల టీకా కార్యక్రమానికి అంతరాయం కలగొద్దని ఆదేశం
- లబ్ధిదారులు టీకా కేంద్రాలకు చేరేలా చర్యలు చేపట్టాలి
- కొవిడ్ ఆస్పత్రుల్లోనూ వ్యాక్సినేషన్
- అయితే, వేర్వేరు భవనాల్లో నిర్వహించాలని సూచన
కరోనా కట్టడి కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విధించిన ఆంక్షలు వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అడ్డుగా మారొద్దని కేంద్రం స్పష్టం చేసింది. ఆంక్షల వల్ల వ్యాక్సినేషన్‌కు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖ రాసింది. లబ్ధిదారులు టీకా కేంద్రాలకు చేరకుండా ప్రయాణాలపై విధించిన ఆంక్షలు అడ్డుపడొద్దని స్పష్టం చేసింది.
అలాగే టీకా కేంద్రాలుగా గుర్తించిన కొవిడ్ ఆస్పత్రులు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించాలని కేంద్రం తెలిపింది. అయితే, కొవిడ్ చికిత్స, వ్యాక్సినేషన్ వేరువేరు భవనాల్లో నిర్వహించాలని స్పష్టం చేసింది. దీంతో టీకా వేయించుకోవడానికి వచ్చిన వారు.. కరోనా సోకిన వారు కలిసే అవకాశం ఉండదని వివరించింది.