Arvind Kejriwal: ఢిల్లీలో లాక్‌డౌన్ విధింపు.. సీఎం కేజ్రీవాల్ ప్రకటన
- నేటి రాత్రి నుంచి వచ్చే సోమవారం ఉదయం వరకు లాక్‌డౌన్
- వలస కార్మికులు వెళ్లకూడదు
- వారి బాగోగులను చూసుకుంటాం
ఢిల్లీలో కరోనా కేసులు పెరిగిపోతోన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరు రోజుల లాక్‌డౌన్ ప్రకటించారు. ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం (ఈ నెల 26) ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని వివరించారు. ఇది చిన్నపాటి లాక్‌డౌన్ మాత్రమేనని, వలస కార్మికులు ఎవ్వరూ ఢిల్లీ నుంచి వెళ్లకూడదని ఆయన కోరారు.
తాము లాక్‌డౌన్‌ను ఆరు రోజులు మాత్రమే కొనసాగిస్తామని, లాక్‌డౌన్ పొడిగింపు అవకాశాలేవీ ఉండబోవని చెప్పారు. లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికుల బాగోగులను ప్రభుత్వమే చూసుకుంటుందని ప్రకటించారు. ఈ లాక్‌డౌన్ సమయంలో ఢిల్లీలో తాము ఆసుపత్రుల్లో కరోనా బెడ్లను పెంచడం, ఆక్సిజన్ సమకూర్చడం వంటి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలోనే లాక్‌డౌన్ విధిస్తున్నామని, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.