Jagan: ఏపీలో విద్యాసంస్థల కొనసాగింపు, పరీక్షల నిర్వహణపై కాసేపట్లో సీఎం జగన్ కీలక నిర్ణయం!
- ఏపీలో కరోనా విజృంభణ
- వేలాదిగా కొత్త కేసులు, పదుల సంఖ్యలో మరణాలు
- విద్యాసంస్థల్లోనూ కరోనా దూకుడు
- మంత్రులు ఆళ్ల నాని, సురేశ్ లతో సీఎం జగన్ భేటీ
- హాజరైన సంబంధిత శాఖల అధికారులు
దేశంలో మాయదారి కరోనా అడ్డుఅదుపు లేకుండా విజృంభిస్తోన్న తరుణంలో అనేక రాష్ట్రాలు విధిలేని పరిస్థితుల్లో మళ్లీ లాక్ డౌన్ లోకి వెళ్లిపోతున్నాయి. కొన్ని రాష్ట్రాలు విద్యాసంస్థలు మూసివేసి, పబ్లిక్ పరీక్షలు రద్దు చేస్తున్నాయి. ఏపీలోనూ కరోనా ప్రమాద ఘంటికలు మోగుతుండడంతో సీఎం జగన్ అత్యవసర సమావేశం నిర్వహించారు.
ఈ భేటీకి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో విద్యాసంస్థల కొనసాగింపు, పరీక్షల నిర్వహణ, కరోనా వ్యాప్తి నివారణ తదితర అంశాలపై సీఎం జగన్ వారితో చర్చించారు. ఈ భేటీ కొద్దిసేపటి కిందట ముగియగా, కాసేపట్లో సీఎం మరోసారి సమావేశమై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
దేశంలో సెకండ్ వేవ్ ప్రారంభం అయ్యాక ఏపీలోనూ కొవిడ్ తీవ్రరూపు దాల్చింది. గత కొన్నిరోజులుగా 6 వేలకు మించి కొత్త కేసులు రావడమే కాదు, పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. విద్యాసంస్థల్లోనూ కరోనా ప్రబలడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన అధికమవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదానిపై సర్వత్ర ఆసక్తి వ్యక్తమవుతోంది.