Nasa: అంగారకుడిపై హెలికాప్టర్ చక్కర్లు... నాసా మరో ఘనత
- అంగారకుడి ఉపరితలంపై నాసా పరిశోధనలు
- ఇంజెన్యుటీ పేరిట చిన్న డ్రోన్ విహారం
- నిమిషం కంటే తక్కువ వ్యవధిలో విహారం
- భవిష్యత్తులో మరిన్ని విహారాలు చేయవచ్చంటున్న నాసా
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఖాతాలో మరో ఘనత చేరింది. అంగారకుడి ఉపరితలంపై పరిశోధనలు సాగిస్తున్న నాసా ఈ క్రమంలో ఓ చిన్న హెలికాప్టర్ ను విజయవంతంగా పరీక్షించింది. ఈ హెలికాప్టర్ డ్రోన్ పేరు ఇంజెన్యుటీ. అరుణ గ్రహం ఉపరితలం నుంచి పైకి లేచిన ఇంజెన్యుటీ ఓ నిమిషం కంటే తక్కువ సేపే ప్రయాణించినప్పటికీ నాసా దాన్నొక ఘనవిజయంగా భావిస్తోంది. అంగారకుడిపై పూర్తి నియంత్రణతో విహరించడం గతంలో ఏ అంతరిక్ష పరిశోధన సంస్థకు సాధ్యం కాలేదు. ఇప్పుడా చిరస్మరణీయ ఘట్టాన్ని నాసా సాధ్యం చేసింది.
ఈ చిన్న హెలికాప్టర్ డ్రోన్ విహారానికి సంబంధించిన సమాచారాన్ని అంగారకుడి చుట్టూ పరిభ్రమిస్తున్న ఓ శాటిలైట్ భూమికి చేరవేసింది. ఈ హెలికాప్టర్ విజయవంతం కావడంతో భవిష్యత్తులో అంగారకుడిపై మరిన్ని గగనతల విహారాలు చేయవచ్చన్న ధీమా నాసాలో వ్యక్తమవుతోంది. నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబరేటరీస్ ప్రాజెక్ట్ మేనేజర్ మిమీ ఆంగ్ మాట్లాడుతూ, హెలికాప్టర్ వంటి రోటార్ ఆధారిత వాహనాలతో మానవులు ఇతర గ్రహాల్లోనూ విహారం చేయవచ్చన్న నమ్మకం కలుగుతోందని తెలిపారు. భూమండలంపై నాడు రైట్ సోదరులు చేసిన అద్భుత కార్యాన్ని అంగారకుడిపై సాధ్యం చేయడానికి చాలా కాలం పట్టిందని వివరించారు.
1903లో విల్బర్ రైట్, ఆర్విల్ రైట్ అనే సోదరులు పూర్తి నియంత్రణతో కూడిన వాయు విహారం చేసి విమానాల ఆవిష్కరణకు నాంది పలికారు.