Covid Command Control Centre: కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను పునరుద్ధరించిన ఏపీ ప్రభుత్వం
- ఏపీలో కరోనా బీభత్సం
- కమాండ్ కంట్రోల్ సెంటర్ పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు
- చైర్మన్ గా జవహర్ రెడ్డి
- వెంటనే బాధ్యతలు అందుకోవాలని ఆదేశాలు
- 21 మందితో ప్రత్యేక అధికారుల కమిటీ
ఏపీలో కరోనా రక్కసి స్వైరవిహారం చేస్తున్న నేపథ్యంలో రోజువారీ కేసుల సంఖ్య వేలల్లో ఉంటోంది. గతేడాది లాక్ డౌన్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా స్థితిగతులపై పర్యవేక్షణ కోసం కొవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏపీ సర్కారు నేడు పునరుద్ధరించింది. కమాండ్ సెంటర్ చైర్మన్ గా జవహర్ రెడ్డిని నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జవహర్ రెడ్డి వెంటనే బాధ్యతలు అందుకోవాలని స్పష్టం చేసింది. జవహర్ రెడ్డి ప్రస్తుతం టీటీడీలో కార్యనిర్వాహణాధికారిగా పనిచేస్తున్నారు.
అటు, రాష్ట్రంలో కొవిడ్ నివారణ, వ్యాక్సినేషన్ తదితర అంశాల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక అధికారుల కమిటీ ఏర్పాటు చేసింది. 21 మంది సభ్యులు గల ఈ కమిటీలో పీయూష్ కుమార్, మల్లికార్జున్, విజయరామరాజు, శ్రీకాంత్, అభిషేక్ మహంతి, కృష్ణబాబు, రవిచంద్ర వంటి అధికారులు ఉన్నారు.