IPL 2021: రాజస్థాన్‌ను చిత్తుగా ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్

Chennai Super Kings Defeated Rajasthan Royals

  • బ్యాటింగ్‌లో విఫలమైన రాజస్థాన్
  • మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మొయీన్ అలీ
  • ఐపీఎల్‌లో ధోనీ సేనకు రెండో విజయం

ఐపీఎల్‌లో భాగంగా గత రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 10, డుప్లెసిస్ 33, మొయీన్ అలీ 26, రైనా 18, రాయుడు 17, రవీంద్ర జడేజా 8, కెప్టెన్ ధోనీ 18, శామ్ కరణ్ 13 పరుగులు చేయగా, బ్రేవో 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో చేతన్ సకారియా 3 వికెట్లు తీసుకోగా, క్రిస్ మోరిస్ 2, ముస్తాఫిజుర్, రాహుల్ తెవాటియా చెరో వికెట్ తీసుకున్నారు.

అనంతరం 189 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. జోస్ బట్లర్ (49), రాహుల్ తెవాటియా (20), జయదేవ్ ఉనద్కత్ (24) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ఆటతీరు కనబర్చలేకపోయారు. ఆరుగురు ఆటగాళ్లు రెండంకెల స్కోర్లు కూడా సాధించలేకపోయారు.

చెన్నై బౌలర్లలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మొయీన్ అలీ 3 వికెట్లు పడగొట్టగా శామ్ కరణ్, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. శార్దూల్ ఠాకూర్, బ్రావో చెరో వికెట్ పడగొట్టారు. ఐపీఎల్‌లో రాజస్థాన్‌కు ఇది రెండో ఓటమి కాగా, ధోనీ సేనకు ఇది రెండో విజయం. నేడు ఢిల్లీ కేపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య చెన్నైలో మ్యాచ్ జరగనుంది.

  • Loading...

More Telugu News